PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్‌ కెప్టెన్‌.. తొలి ఆటగాడిగా..!

9 Jun, 2022 10:18 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో బాబర్‌ సెంచరీతో చెలరేగాడు. కాగా ఏడాదిలో వన్డేల్లో బాబర్‌కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో రెండుసార్లు వరుసగా హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా బాబర్‌ ఆజాం రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అఖరి రెండు మ్యాచ్‌ల్లో బాబర్‌ వరుసగా సెంచరీలు సాధించాడు.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత స్వదేశంలో విండీస్‌తో పాక్‌ తలపడతోంది. విండీస్‌తో ఆడిన తొలి వన్డేలోనే బాబర్‌ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి సారిగా బాబర్‌ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముల్తాన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై పాక్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. విండీస్‌ బ్యాటర్లలో షాయీ హోప్‌ 127,బ్రూక్స్‌ 70 పరుగులతో రాణించారు. అనంతరం 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బాబర్‌ ఆజం(103) సెంచరీతో చెలరేగాడు.
పాకిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ మొదటి వన్డే:
♦టాస్‌- వెస్టిండీస్‌- బ్యాటింగ్‌
♦వెస్టిండీస్‌ స్కోరు: 305/8 (50)
♦పాకిస్తాన్‌ స్కోరు: 306/5 (49.2)
చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే!

మరిన్ని వార్తలు