Babar Azam: నయా నంబర్‌వన్

15 Apr, 2021 05:50 IST|Sakshi

తొలిసారి టాప్‌ ర్యాంక్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌

2017 తర్వాత రెండో ర్యాంక్‌కు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌  

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 94 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు తగిన ప్రతిఫలం లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి బాబర్‌ ఆజమ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. 2015 నుంచి అంతర్జాతీయ వన్డేలు ఆడుతున్న 26 ఏళ్ల ఆజమ్‌ ఖాతాలో ప్రస్తుతం 865 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఆజమ్‌ టాప్‌ ర్యాంక్‌లోకి రావడంతో 1,258 రోజుల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 857 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు.

2017 అక్టోబర్‌ నుంచి కోహ్లి వన్డేల్లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 825 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, రాస్‌ టేలర్‌ (న్యూజిలాండ్‌–801 పాయింట్లు) నాలుగో స్థానంలో, ఫించ్‌ (ఆస్ట్రేలియా–791 పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.  ఇప్పటివరకు 80 వన్డేలు ఆడిన బాబర్‌ ఆజమ్‌ 56.83 సగటుతో 3,808 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో బాబర్‌ ఆజమ్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ ఐదు కాగా ప్రస్తుతం ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు. టి20ల్లో గతంలో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ఆజమ్‌ ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు