బాబర్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది

17 Nov, 2022 21:12 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో పాకిస్తాన్‌ ఫైనల్‌ చేరినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం మాత్రం అంతగా రాణించలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో బాబర్‌ కెప్టెన్సీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. మరికొంత మంది బాబర్‌ కెప్టెన్‌గా పనికిరాడని, తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

తాజాగా బాబర్‌ను ఉద్దేశించి పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బాబర్‌ టీ20 కెప్టెన్సీని వదులుకుని వన్డేలు, టెస్టుల్లో జట్టును నడిపించడంపై దృష్టి సారించాలని అఫ్రిది సూచించాడు. అదే విధంగా పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో కూడా పెషావర్ జల్మీ కెప్టెన్సీ బాధ్యతలు ఆజం చేపట్టకూడదని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ సీజన్‌ వరకు కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బాబర్‌.. వచ్చే ఏడాది సీజన్‌లో పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

 "బాబర్‌ ఆజంను నేను చాలా గౌరవిస్తాను. అందుకే అతడు టీ20 క్రికెట్‌లో కెప్టెన్సీ ఒత్తిడిని తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అతడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, టెస్టు ఫార్మాట్‌లపై దృష్టిపెట్టాలి. షాదాబ్‌, రిజ్వాన్‌, షాన్‌ మసూద్‌ వంటి వంటి ఆటగాళ్లకి టీ20 ఫార్మాట్‌లో జట్టును నడిపించే సత్తా ఉంది. అదే విధంగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ‍కూడా బాబర్‌ సారథ్య బాధ్యతలు చేపట్టకూడదు. అతడు ప్రస్తుతం తన బ్యాటింగ్‌పై దృష్టిసారించాలని" సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్‌.. టీమిండియా ఓపెనర్‌గా రావాలి

మరిన్ని వార్తలు