Babar Azam: భారత్‌పై గెలుపొక్కటే కాదు.. ఆసియా కప్‌ కొట్టాలని కంకణం!

19 Aug, 2022 09:31 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఆసియా కప్‌ కొట్టాలని కంకణం కట్టుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాక్‌ కెప్టెన్‌ కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. కొడితే సెంచరీ లేదంటే అర్థసెంచరీలుగా సాగుతుంది బాబర్‌ ఇన్నింగ్స్‌. ఒకప్పటి కోహ్లిని తలపిస్తోన్న బాబర్‌ ఆజంను కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు సవాల్‌గా మారిపోయింది. ఇక గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలోనూ బాబర్‌ అర్థ సెంచరీతో మెరిశాడు.

వన్డేల్లో తొమ్మిది వరుస ఇన్నింగ్స్‌లో బాబర్‌కు ఇది ఎనిమిదో అర్థ సెంచరీ కావడం విశేషం. మరొకటి ఏంటంటే.. అతను హాఫ్‌ సెంచరీ సాధించిన ఎనిమిది సార్లు పాకిస్తాన్‌నే విజయం వరించింది. ఈ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే విఫలమైన బాబర్‌.. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరి ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థితో తలపడనున్న నేపథ్యంలో బాబర్‌ ఆజం ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

బాబర్‌ టార్గెట్‌ భారత్‌పై గెలుపుతో పాటు ఆసియా కప్‌ అందించడమేనట. ఎందుకంటే బాబర్‌ ఆజం తాను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాక్‌ ఖాతాలో ఒక్క మేజర్‌ టోర్నీ కూడా గెలవలేదు. అందుకే ఆసియా కప్‌ను గెలిచి.. రానున్న టి20 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టాలని బాబర్‌ భావిస్తున్నాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లోనూ బాబర్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ మంచి ప్రదర్శన కనబరిచింది. లీగ్‌ దశలో ఓటమెరుగని పాకిస్తాన్‌.. సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

ఇక పాకిస్తాన్‌ ఆసియా కప్‌ నెగ్గి దశాబ్దం అయిపోయింది. చివరిసారి 2012లో మిస్బా ఉల్‌ హక్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌ను ఫైనల్లో మట్టికరిపించి ఆసియాకప్‌ను అందుకుంది. అప్పటి నుంచి మరోసారి ఆ కప్‌ను సాధించలేకపోయింది. మరి బాబర్‌ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్‌ జట్టు ఆసియా కప్‌ కొల్లగొడుతుందేమో చూడాలి.

చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు'

మరిన్ని వార్తలు