Babar Azam: పాక్‌ కెప్టెన్‌ అరుదైన ఘనత.. మెచ్చుకొని తీరాల్సిందే!

7 Apr, 2022 21:15 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఆల్‌టైమ్‌ వన్డే ర్యాంకింగ్స్‌ జాబితాలో బాబర్‌ ఆజం భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను అధిగమించి 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో 57, 114,105* సూపర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న బాబర్‌ ఆజం కోసం ఐసీసీ ప్రత్యేకంగా ఆల్‌టైమ్‌ ర్యాంకింగ్స్‌ను సవరించింది. దీనిలో భాగంగానే బాబర్‌.. 891 పాయింట్లతో సచిన్‌ను అధిగమించి 15వ స్థానంలో నిలిచాడు.

సచిన్‌ 887 పాయింట్లతో 16వ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి సచిన్‌ కంటే కోహ్లి చాలా ముందు ఉన్నాడు. 911 పాయింట్లతో కోహ్లి ఆరో స్థానంలో ఉండడం విశేషం. విండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ 935 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో పాక్‌ గ్రేట్‌ జహీర్‌ అబ్బాస్‌ 931 పాయింట్లతో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ గ్రెగ్‌ చాపెల్‌ 921 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డేవిడ్‌ గ్రోవర్‌(ఇంగ్లండ్‌, 919 పాయింట్లు), డీన్‌ జోన్స్‌( ఆస్ట్రేలియా, 918 పాయింట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

కాగా టాప్‌ 16 మందిని పరిశీలిస్తే.. కోహ్లి, బాబర్‌ ఆజం తప్ప మిగతావారు ఎప్పుడో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. సమకాలీన క్రికెట్‌లో కోహ్లితో పాటు బాబర్‌ ఆజం కూడా మంచి రికార్డులు నమోదు చేస్తున్నాడు. బాబర్‌ ఆజం సాధించిన ఫీట్‌ గురించి తెలుసుకున్న టీమిండియా అభిమానులు.. ''కోహ్లి తర్వాతే ఉన్నప్పటికి.. బాబర్‌ ఆజం ఇటీవలే సూపర్‌గా ఆడుతున్నాడు.. ప్రత్యర్థి అయినా మెచ్చుకొని తీరాల్సిందే'' అంటూ కామెంట్‌ చేశారు. 

చదవండి: Nari Contractor: టీమిండియా మాజీ కెప్టెన్‌ తలలో మెటల్‌ ప్లేట్‌.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ క్రికెటర్‌..

మరిన్ని వార్తలు