PV Sindhu: సూపర్‌ సింధు...

30 Apr, 2022 05:55 IST|Sakshi

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం

క్వార్టర్‌ ఫైనల్లో హి బింగ్‌ జియావోపై గెలుపుతో సెమీస్‌ చేరిక  

మనీలా (ఫిలిప్పీన్స్‌): ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. గతంలో 2014లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఈసారి కూడా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21–9, 13–21, 21–19తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హి బింగ్‌ జియావో (చైనా)పై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఒకదశలో ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది.

అయితే రెండో గేమ్‌లో హి బింగ్‌ జియావో పుంజుకుంది. స్కోరు 9–10 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గిన హి బింగ్‌ జియావో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌ ఆరంభంలో సింధు 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి దానిని కాపాడుకుంది.

చివర్లో సింధు 20–16తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయిన సింధు ఆ వెంటనే మరో పాయింట్‌ గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 13–8తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది.  

పోరాడి ఓడిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ
పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట పతకం సాధించలేకపోయింది. క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 53 నిమిషాల్లో 21–12, 14–21, 16–21తో ఐదో సీడ్‌ ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జంట గెలిచిఉంటే సెమీస్‌ చేరినందుకు కనీసం కాంస్య పతకం లభించేది.  

నేటి సెమీఫైనల్స్‌
ఉదయం గం. 10:30 నుంచి సోనీ టెన్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు