ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్‌

24 Jul, 2021 11:17 IST|Sakshi

స్వర్ణపతకం గెలవాలని కోరుకుంటున్న క్రీడాభిమానులు

అమలాపురం: ఒక తండ్రి 30 ఏళ్ల కల నిజం అయ్యింది. ఒక తల్లి చేసిన పూజలు.. వ్రతాలు ఫలించాయి. ఒక యువకుడి జీవిత లక్ష్యం నెరవేరింది. ప్రతి క్రీడాకారుడు కలలుకనేది ఒలింపిక్స్‌ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం. అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్‌ సాత్విక్, అతని తల్లిదండ్రుల కల కూడా అదే. ఒలిపింక్‌ క్రీడావేదికపై సాత్విక్‌ ప్రతిభాపాటవాల ప్రదర్శించాలనే. ఆ కల శనివారం నెరవేరనుంది. విశ్వక్రీడల్లో క్రీడా యుద్ధానికి సాత్విక్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాడు. టోక్యోలో శనివారం బ్యాడ్మింటన్‌ విభాగంలో డబుల్స్‌లో తొలి లీగ్‌ మ్యాచ్‌ జరుగనుంది.

ఇందులో సాత్విక్‌ ఆడనున్నాడు. సాత్విక్, చిరాగ్‌ శెట్టిల జంటపై క్రీడాభిమానుల్లో అంచనాలు పెరిగాయి. సాత్విక్‌ తన గురువు పుల్లెల గోపీచంద్‌ ఆకాడమీలో సాధన చేస్తున్నాడు. బ్యాడ్మింటన్, ఒలింపిక్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇక్కడి క్రీడాభిమానులు బంగారు పతకం సాధించాలని కోరుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే కల నెరవేరింది. మనదేశం తరఫున ఆడుతున్నానే ఫీలింగ్‌ ఉత్సాహాన్ని నింపిందని టోక్యో వెళుతూ సాత్విక్‌ ‘సాక్షి’తో అన్నాడు. 

ట్రాక్‌ రికార్డు 
► 2018 ఆస్ట్రేలియా కామన్‌వెల్త్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టీమ్‌ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలిసి గోల్డ్‌ మెడల్‌
►  డబుల్స్‌ విభాగంలో చిరాగ్‌ శెట్టితో కలిసి సిల్వర్‌ మెడల్‌   
►  2018లో హైదరాబాద్‌ ఓపెన్, 2019లో థాయిలాండ్‌ ఓపెన్‌ డబుల్స్‌ విభాగంలో స్వర్ణపతకాలు 
►  2018 సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ టోర్నీ, 2019 ఫ్రెంచ్‌ 
►  డబుల్స్‌లో చిరాగ్‌ శెట్టితో  2016లో మౌరిటీస్‌ ఇంటర్‌ నేషనల్, ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ సిరీస్, టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్, 2017లో వియత్నామ్‌ ఇంటర్నేషనల్, 2019 బ్రేజిల్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలలో విజయం
 
చాలా సంతోషంగా ఉంది  
నేను షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడ్ని. అందుకే నా ఇద్దరు కుమారులను ఆ క్రీడలో ప్రోత్సహించాను. ఒక్కరైనా దేశం తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. అది నెరవేరబోతోంది. ఆ కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాయామోపాధ్యాయుడిగా ఎంతోమంది క్రీడాకారులకు ఒలింపిక్స్‌ గురించి గర్వంగా చెప్పేవాడిని. ఇప్పుడు నా కొడుకు ఆ క్రీడల్లో పాల్గొనడం.. చెప్పేందుకు మాటలు రావడం లేదు.  
– ఆర్‌.కాశీవిశ్వనాథ్, సాత్విక్‌ తండ్రి, అమలాపురం 

>
మరిన్ని వార్తలు