‘ధోని కొట్టిన బంతి దొరికింది’ 

24 Sep, 2020 08:09 IST|Sakshi

ముంబై : ‘ధోని ఫినిష్డ్‌ ఆఫ్‌ ఇన్‌స్టయిల్‌...’ రవిశాస్త్రి వ్యాఖ్యానంలో ఈ వాక్యాన్ని సగటు భారత క్రికెట్‌ అభిమాని ఎన్ని సార్లు విని తన్మయత్వం చెందాడో. 2011 ఏప్రిల్‌ 2న భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న చారిత్రాత్మక రోజది. నాటి ఫైనల్లో కులశేఖర వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచి ధోని మ్యాచ్‌ను గెలిపించాడు. నాటి క్షణాన్ని చిరస్మరణీయం చేయాలని భావించిన ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ఇప్పటి వరకు ధోని కొట్టిన బంతి ఆచూకీ కనుగొనడంలో విఫలమైంది. అయితే ఇప్పుడు దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఈ విషయంలో తాను సహకారం అందిస్తానని చెప్పారు.

ఆ మ్యాచ్‌లో ధోని  కొట్టిన బంతిని అందుకున్న అభిమాని గురించి తనకు తెలుసని, తన మిత్రుడు ఒకరికి అతనితో పరిచయం ఉందని గావస్కర్‌ ఎంసీఏకు తెలియజేశారు. దాంతో ఎంసీఏ ఇతర ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమైంది. సదరు వ్యక్తి ఆ మ్యాచ్‌ టికెట్‌తో సహా బంతిని ఒక జ్ఞాపికగా మలచి భద్రపరచినట్లు సమాచారం. ఆ బంతి ఎంసీఏ పెవిలియన్‌ స్టాండ్, ఎల్‌ బ్లాక్‌లోని 210 నంబర్‌ సీటుపై పడింది. ఇప్పుడు ఆ సీటును ఇతర సీట్లకంటే భిన్నంగా ఉండేలా, ప్రత్యేకంగా కనిపించేలా సిద్ధం చేసి ధోని పేరుతో దానిని జ్ఞాపికగా మార్చనున్నారు. (చదవండి : 'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది')

ఈ తరహాలో అంకితం చేయడం భారత్‌లో తొలిసారి అయినా గతంలోనూ క్రికెట్‌లో ఇలా జరిగాయి. ఆ్రస్టేలియా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సైమన్‌ ఒడొనెల్‌ 122 మీటర్ల సిక్స్‌ కొట్టిన సీటును, బిగ్‌ బాష్‌లో బ్రాడ్‌ హాడ్జ్‌ చివరి మ్యాచ్‌ ఆడినప్పుడు కొట్టిన 96 మీటర్ల సిక్సర్‌ సీటును ఇలాగే మార్చారు. 2015 ప్రపంచకప్‌ సెమీస్‌లో స్టెయిన్‌ బౌలింగ్‌లో గ్రాంట్‌ ఇలియట్‌ కొట్టిన సిక్సర్‌తో న్యూజిలాండ్‌ తొలిసారి ఫైనల్‌ చేరగా...ఆక్లాండ్‌లో ఆ సీటును ఇలాగే మార్చారు. (చదవండి : ధోని హ్యాట్రిక్‌ సిక్సర్లు.. పోరాడి ఓడిన సీఎస్‌కే)

మరిన్ని వార్తలు