BAN VS ENG 1st ODI: మలాన్‌ వీరోచిత పోరాటం.. పసికూన్‌పై అతికష్టం మీద గెలిచిన ఇంగ్లండ్‌

1 Mar, 2023 19:49 IST|Sakshi

3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న వరల్డ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టు.. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను.. డేవిడ్‌ మలాన్‌ (145 బంతుల్లో 114 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడి గెలిపించాడు.

ఛేదనలో తడబడిన ఇంగ్లండ్‌.. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు అనుకున్న దశలో మలాన్‌ తన అనుభవాన్ని అంతా రంగరించి, టెయిలెండర్ల  సాకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆదిల్‌ రషీద్‌ (29 బంతుల్లో 17 నాటౌట్‌; ఫోర్‌)ను సమన్వయం చేసుకుంటూ మలాన్‌ పోరాడిన తీరు అమోఘం. మలాన్‌- రషీద్‌ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, మరో 8 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చింది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో మలాన్‌, రషీద్‌ మినహా జేసన్‌ రాయ్‌ (4), ఫిలిప్‌ సాల్ట్‌ (12), జేమ్స్‌ విన్స్‌ (6), జోస్‌ బట్లర్‌ (9), క్రిస్‌ వోక్స్‌ (7), మొయిన్‌ అలీ (14), విఫలం కాగా.. విల్‌ జాక్స్‌ (26) కాస్త పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహదీ హసన్‌ మిరాజ్‌ 2, షకీబ్‌ అల్‌ హసన్‌, తస్కిన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అంతకుముందు టాస్‌​గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తమీమ్‌ ఇక్బాల్‌ (23), షాంటో (58), మహ్మదుల్లా (31) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోప్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌, మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌, విల్‌ జాక్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 3న ఇదే వేదికపై జరుగుతుంది. 

మరిన్ని వార్తలు