Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్‌ అదుర్స్‌

15 Mar, 2023 13:55 IST|Sakshi

Bangladesh Clean Sweep England T20 Series 2023: ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్‌ 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది.

ఇంగ్లండ్‌కు ఇది రెండోసారి మాత్రమే
కాగా మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2012లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్‌ తొలిసారి ఈ ఘనత సాధించింది. ఇక బంగ్లాదేశ్‌–ఇంగ్లండ్‌ మధ్య ద్వైపాక్షిక టి20 సిరీస్‌ జరగడం కూడా ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ జట్టు మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోవడం ఇది రెండోసారి మాత్రమే.

అసలు ఈ మనిషి కనబడటం లేదే!
2014లో ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి ఇంగ్లండ్‌ 0–3తో చేజార్చుకుంది.  ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ను ఉద్దేశించి.. ‘‘చాలా రోజులు అవుతోంది.. అసలు ఈ మనిషి కనబడటం లేదే!’’ అన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

కాగా గతంలో టీమిండియా- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో భారత పిచ్‌లపై అవాకులు చెవాకులు పేలుతూ వాన్‌ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే వసీం జాఫర్‌- మైకేల్‌ వాన్‌ మధ్య ఓ రేంజ్‌లో ట్విటర్‌ వార్‌ జరిగింది. భారత జట్టును తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారీ మైకేల్‌కు అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడం వసీంకు అలవాటు.

వైరల్‌ ట్వీట్‌
ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఊహించని రీతిలో దారుణంగా పరాభవం పాలుకావడం.. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్‌ గెలిచి టీమిండియా వరుసగా నాలుగోసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో ఈ మేరకు వసీం.. వాన్‌కు కౌంటర్‌ వేశాడు. ‘లాంగ్‌ టైమ్‌ నో సీ’ అంటూ #BANvENG హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సరైన సమయంలో సరైన కౌంటర్‌ అంటూ వసీం జాఫర్‌ను ప్రశంసిస్తున్నారు టీమిండియా అభిమానులు.

ఇక బంగ్లా- ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌ మ్యాచ్‌ విషయంలో ఆఖరిదైన మూడో టి20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (57 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా... నజ్ముల్‌ (36 బంతుల్లో 47 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు.

అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడిపోయింది. డేవిడ్‌ మలాన్‌ (47 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లిటన్‌ దాస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... నజ్ముల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.

చదవండి: WTC Final: కేఎస్‌ భరత్‌ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?!  
ఖరీదైన 6 బెడ్‌ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్‌.. ధర ఎంతో తెలుసా..?

మరిన్ని వార్తలు