BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్‌! రోహిత్‌తో పాటు

8 Dec, 2022 10:22 IST|Sakshi

బంగ్లాదేశ్‌ చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన భారత్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు యువ పేసర్లు దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ సేన్‌ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నారు. ఢాకా వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్‌ చేతి వేలికి గాయం కాగా.. దీపక్‌ చహర్‌కు కండరాలు పట్టేశాయి.

అదే విధంగా తొలి వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ  పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో వీరు ముగ్గురు గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. ఈ విషయాన్ని భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా దృవీకరించాడు.

ఇక అఖరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టు కోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే చటోగ్రామ్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.

అయితే దీపక్‌, రోహిత్‌,కుల్దీప్‌ రిప్లేస్‌మెంట్‌ను బీసీసీఐ ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం జట్టులో సిరాజ్‌, శార్థూల్‌, ఉమ్రాన్‌ మినహా అదనపు పేసర్‌ ఒక్కరు కూడా లేరు. ఇక బం‍గ్లాతో అఖరి వన్డేకు రోహిత్‌ దూరం కావడంతో కేఎల్‌ రాహుల్‌ భారత కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించున్నాడు.
చదవండి: చేతి వేలికి ఫ్రాక్చర్‌ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు