Shakib Al Hasan: వారెవ్వా.. అంతర్జాతీయ టీ20లలో మొనగాడు.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా

29 Mar, 2023 20:58 IST|Sakshi

Bangladesh vs Ireland, 2nd T20I - Shakib Al Hasan: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌతీని వెనక్కినెట్టి ముందుకు దూసుకువచ్చాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా ఐదు వికెట్లు కూల్చిన షకీబ్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

టపాటపా.. ఐదు వికెట్లు
చట్టోగ్రామ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐరిష్‌ ఓపెనర్‌ రాస్‌ అడేర్‌(6), వికెట్‌ కీపర్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ లోర్కాన్‌ టక్కర్‌(5), నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ టెక్టార్‌(22), ఐదో స్థానంలో దిగిన గరేత్‌ డెలనీ(6), ఆరో స్థానంలో వచ్చిన జార్జ్‌ డాక్రెల్‌(2) వికెట్లను షకీబ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

వీరందరినీ తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఐర్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటు బ్యాట్‌(38 నాటౌట్‌)తోనూ ఇటు బంతితోనూ మ్యాజిక్‌ చేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడీ స్పిన్‌ ఆల్‌రౌండర్‌. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి.. బంగ్లాకు మరో సిరీస్‌ విజయం అందించాడు.

ఇప్పటి దాకా అన్ని వరల్డ్‌కప్‌లలో
కాగా అంతర్జాతీయ టీ20లలో వికెట్ల విషయంలో ఇప్పటివరకు టిమ్‌ సౌతీ ముందంజలో ఉండగా.. షకీబ్‌ అతడిని అధిగమించాడు. తద్వారా నంబర్‌1 గా అవతరించాడు. 2006లో జింబాబ్వేతో మ్యాచ్‌తో ఇంటర్నేషనల్‌ టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టిన షకీబ్‌ ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ పాల్గొనడం విశేషం. ఇప్పటి వరకు అతడు బంగ్లా తరఫున 114 మ్యాచ్‌లు ఆడాడు. 

అంతర్జాతీయ టీ20లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే!
1. షకీబ్‌ అల్‌ హసన్‌- బంగ్లాదేశ్‌- 136 వికెట్లు
2. టిమ్‌ సౌతీ- న్యూజిలాండ్‌- 134 వికెట్లు
3. రషీద్‌ ఖాన్‌- అఫ్గనిస్తాన్‌-   129 వికెట్లు
4. ఇష్‌ సోధి- న్యూజిలాండ్‌- 114 వికెట్లు
5. లసిత్‌ మలింగ- శ్రీలంక -107 వికెట్లు

చదవండి: BAN Vs IRE: చరిత్ర సృష్టించిన లిటన్‌ దాస్‌.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి..

మరిన్ని వార్తలు