సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు చుక్కెదురు.. సిరీస్‌ కైవసం చేసుకున్న కివీస్‌

26 Sep, 2023 19:45 IST|Sakshi

సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు చుక్కెదురైంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 26) జరిగిన మూడో వన్డేలో పర్యాటక జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులకు ఆలౌటైంది. ఆడమ్‌ మిల్నే (4/34), ట్రెంట్‌ బౌల్ట్‌ (2/33), మెక్‌కొంచి (2/18) బంగ్లా పతనాన్ని శాశించగా.. లోకి ఫెర్గూసన్‌, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ నజ్ముల్‌ హొసేన్‌ షాంటో (76) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తౌహిద్‌ హ్రిదోయ్‌ (18), ముష్ఫికర్‌ రహీమ్‌ (18), మహ్మదుల్లా (21), మెహిది హసన్‌ (13) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లరే పరిమితమయ్యారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ కేవలం 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్‌ యంగ్‌ (70), హెన్రీ నికోల్స్‌ (50 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించగా.. ఫిన్‌ అలెన్‌ (28), టామ్‌ బ్లండెల్‌ (23 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్‌ అరంగేట్రం​ ఆటగాడు డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్‌ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టగా.. నసుమ్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 

మరిన్ని వార్తలు