Babar Azam- Ban Vs Pak: నేను ప్రతిసారీ పరుగులు సాధించాలని ఎక్కడా రాసిలేదు.. కచ్చితంగా రాణిస్తా

25 Nov, 2021 15:52 IST|Sakshi

తన ఫామ్‌ గురించి ఆందోళన లేదన్న పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌

Pakistan Skipper Babar Azam Opened Up on His Form Ahead of Bangladesh Test Series: టీ20 సిరీస్‌లో 3-0 తేడాతో బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్‌ చేసిన పాకిస్తాన్‌ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైంది. నవంబరు 26(శుక్రవారం)న తొలి టెస్టు జరుగనున్న నేపథ్యంలో అందరి దృష్టి కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ మీదే ఉంది. టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో సారథిగా.. బ్యాటర్‌గా ఆకట్టుకున్న బాబర్‌.. బంగ్లాతో సిరీస్‌లో మాత్రం ఓపెనర్‌గా విఫలం కావడమే ఇందుకు కారణం. మూడు టీ20 మ్యాచ్‌లలో కలిపి అతడు కేవలం 27 పరుగులు(7,1,19) మాత్రమే చేశాడు. దీంతో బాబర్‌ ఆట తీరును ట్రోల్‌ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

ఈ క్రమంలో టెస్టు మ్యాచ్‌ ఆరంభానికి ముందు మీడియాతో వర్చువల్‌గా సమావేశమైన బాబర్‌ తన ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యాఖ్యానించాడు. ‘‘నేను ప్రతిసారీ భారీగా పరుగులు రాబట్టాలని ఎక్కడా రాసి పెట్టలేదు కదా.. టీ20 సిరీస్‌లో తమ వంతు బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం టెస్టు సిరీస్‌ మీదే ఉంది. కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇక ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్‌ జరుగుతున్న నేపథ్యంలో.. ‘‘ఇటీవలి కాలంలో ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడుతున్నాం. వెంటనే టెస్టు ఫార్మాట్‌కు సిద్ధం కావడం సవాలే. టీ20 సిరీస్‌ తర్వాత పూర్తి స్థాయిలో టెస్టు మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యే సమయం దొరకలేదు. అయితే, మా జట్టులో చాలా మందికి దేశవాళీ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. కచ్చితంగా డబ్ల్యూటీసీలో మాదైన ముద్ర వేస్తాం’’ అని బాబర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇక స్వదేశంలో సిరీస్‌ జరుగనుండటం బంగ్లాదేశ్‌కు అనుకూలిస్తుందన్న అతడు.. సొంతగడ్డపై వాళ్లను ఓడించడం అంత తేలికేమీ కాదని పేర్కొన్నాడు. గట్టి పోటీ ఖాయమని చెప్పుకొచ్చాడు.

చదవండి: India vs New Zealand Test: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర...
Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్‌.. ఫొటోలు వైరల్‌

మరిన్ని వార్తలు