BAN VS SL: డబుల్‌ చేజార్చుకున్న లంక క్రికెటర్‌.. క్రికెట్‌ చరిత్రలో 12వ ఆటగాడిగా..!

17 May, 2022 09:05 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ రంజుగా సాగుతున్న వేళ టెస్ట్‌ క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య చట్టోగ్రామ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక వెటరన్‌ ఆల్‌రౌండర్‌ ఏంజలో మాథ్యూస్‌ ఒక్క పరుగు తేడాతో డబుల్‌ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 153 ఓవర్లలో 397 పరుగులకు ఆలౌటైంది. 

కుశాల్ మెండిస్ (54), దినేశ్ చండీమాల్ (66) అర్ధ సెంచరీలతో రాణించగా.. ఏంజలో మాథ్యూస్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 397 బంతులను ఎదుర్కొన్న మాథ్యూస్‌.. 19 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 199 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.  నయీమ్‌ బౌలింగ్‌లో అనవసర షాట్‌ ఆడిన మాథ్యూస్‌ తృటిలో కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 

తద్వారా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న 12వ ఆటగాడిగా, మూడో లంక క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 1984లో పాక్‌ ఆటగాడు ముదస్సర్‌ నాజర్‌ భారత్‌పై, 1986లో మహ్మద్‌ అజహారుద్దీన్‌ శ్రీలంకపై, 1997లో మాథ్యూ ఇలియట్‌ (ఆసీస్‌) ఇంగ్లండ్‌పై, అదే ఏడాది సనత్ జయసూర్య భారత్‌పై, 1999లో స్టీవ్‌ వా వెస్టిండీస్‌పై, 2006లో యూనిస్‌ ఖాన్‌ భారత్‌పై, 2008లో ఇయాన్‌ బెల్‌ సౌతాఫ్రికాపై, 2015లో స్టీవ్‌ స్మిత్‌ వెస్టిండీస్‌పై, 2016లో కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌పై, 2017లో డీన్‌ ఎల్గర్‌ బంగ్లాదేశ్‌పై, 2020లో డెప్లెసిస్‌ శ్రీలంకపై డబుల్‌ చేసే అవకాశాన్ని పరుగు తేడాతో కోల్పోయారు. 

అంతకుముందు మాథ్యూస్‌ 2009లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో సెంచరీ, డబుల్‌ సెంచరీని పరుగు తేడాతో మిస్‌ ఏకైక క్రికెటర్‌గా మాథ్యూస్‌ రికార్డు సాధించాడు.

కాగా, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ వికెట్‌ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. హసన్‌ రాయ్‌ (31), తమీమ్‌ ఇక్బాల్‌ (35) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకు ఆలౌటైంది.  నయీమ్‌ 6 వికెట్లతో సత్తా చాటగా, వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 
చదవండి: ఐపీఎల్‌ ఎఫెక్ట్‌.. ఇంగ్లండ్‌ పర్యటనకు రహానే దూరం
 

మరిన్ని వార్తలు