BAN Vs SL: చెలరేగిన ముష్ఫికర్‌.. బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్‌

26 May, 2021 07:42 IST|Sakshi
Courtesy: Bangladesh Cricket

బాగానే ఆడాం.. కానీ: తమీమ్‌ ఇక్బాల్‌

అనుభలేమి వల్లే భారీ మూల్యం చెల్లించాం: కుశాల్‌ పెరీరా

ఢాకా: ముష్ఫికర్‌ రహీమ్‌ (125; 10 ఫోర్లు) శతక్కొట్టడంతో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2–0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 103 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట బంగ్లాదేశ్‌ 48.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో లంక లక్ష్యాన్ని 40 ఓవర్లలో 245 పరుగులుగా నిర్దేశించారు. అయితే శ్రీలంక 40 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేసి ఓడింది. మెహదీ హసన్, ముస్తఫిజుర్‌ చెరో 3 వికెట్లు తీశారు. ఈ నెల 28న ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగుతుంది.

ఇక విజయం గురించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ముష్ఫికర్‌ రహీం మాట్లాడుతూ.. ‘‘నా ఇన్నింగ్స్‌ తృప్తినిచ్చింది. అయితే, చివరి 11 బంతులు ఆడలేకపోవడం నిరాశ కలిగించింది. మహ్మదుల్లా కూడా గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. ముఖ్యంగా బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు అద్భుతంగా రాణించారు. ఇలాంటి పిచ్‌పై ఆడటం అంత తేలికేమీ కాదు. కాబట్టి నేటి మ్యాచ్‌తో మా బ్యాట్స్‌మెన్‌ మరిన్ని పాఠాలు నేర్చుకున్నారనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.

అప్పుడే మరింత సంతోషం: తమీమ్‌ ఇక్బాల్‌
అదే విధంగా కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు మ్యాచ్‌లు గెలవడం అదృష్టంగా భావిస్తున్నాం. అయితే, సిరీస్‌లో ఇంతవరకు మేం పరిపూర్ణంగా ఆడలేదనే అనుకుంటున్నా. ముషి, మహ్మదుల్లా ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోరు చేశాం. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ బాగుంది. కానీ అది సరిపోదు. ఇంకా మెరుగుపడాలి. కొన్ని క్యాచ్‌లు మిస్సయ్యాయి. అవికూడా పట్టి ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని’’ అని పేర్కొన్నాడు.

అనుభవలేమి కనబడింది: కుశాల్‌ పెరీరా
‘‘రెండు మ్యాచ్‌లలోనూ మాకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా మిడిలార్డర్‌ కుప్పకూలింది. అనుభవలేమి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. సమీక్ష చేసుకుంటాం. నిర్భయంగా ఆడాల్సిన అవసరం గురించి చర్చిస్తాం’’ అని శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ పెరీరా ఓటమి గురించి స్పందించాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: BAN Vs SL:నేనేమీ పొలార్డ్‌ లేదా రస్సెల్‌ కాదు.. కానీ!

మరిన్ని వార్తలు