బాల్‌ టాంపరింగ్‌ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్‌ కెప్టెన్‌

19 May, 2021 16:23 IST|Sakshi

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియాలో పెను దుమారం రేపిన బాల్‌ టాంపరింగ్‌ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగిందని ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ వెల్లడించాడు. బాన్‌క్రాఫ్ట్‌తో బౌలర్లు సమావేశమై సమస్యను పరిష్కరించుకున్నారని అతను ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరులు అడిన ప్రశ్నలకు తికమక పడిన బాన్‌క్రాఫ్ట్‌.. ఒత్తిడిలో అలా మాట్లాడాడని, ఈ ఉదంతం గురించి బౌలర్లకు ముందుగానే తెలుసన్న విషయమై అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించాడు. 

కాగా, 2018లో వెలుగు చూసిన బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆసీస్‌ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటనపై పునర్విచారణ జరిపేందుకు తాము సిద్దమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది.దీంతో నాటి జట్టులో సభ్యులైన కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, స్టార్క్‌లు బాన్‌క్రాఫ్ట్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు బౌలర్లు ఆ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదంటు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకులో ఏదో సమాధానం చెప్పానని బాన్‌క్రాఫ్ట్ తమకు వివరణ ఇచ్చాడని వారు పేర్కొన్నారు. 

ఈ విషయమై బాన్‌క్రాఫ్ట్‌ కూడా అదే సమాధానం చెప్పాడు. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్‌కు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లైంది. కాగా, 2018లో కేప్‌టౌన్‌ వేదికగా ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టులో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం వెలుగు చూసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ బంతికి సాండ్‌ పేపర్‌ రుద్దుతూ కెమెరాల కంటపడ్డాడు. దీంతో అతనితో పాటు అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌పై నిషేధం విధించారు. 
చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం..

మరిన్ని వార్తలు