స్వదేశంలో 6000 పరుగులు, 300 వికెట్లు సాధించిన షకీబ్‌

25 Jan, 2021 18:24 IST|Sakshi

ఢాకా: అంతర్జాతీయ క్రికెట్‌లో బ‌ంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబుల్ హ‌స‌న్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. సోమ‌వారం విండీస్‌తో జ‌రిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ష‌కీబ్‌.. ఎవ‌రికీ సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఒకే దేశంలో 6 వేల‌కుపైగా ప‌రుగులు, 300కుపైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అత‌ను స్వదేశంలో ఆడిన మ్యాచ్‌ల్లో(టెస్టులు, వన్డేలు, టీ20లు క‌లిపి) ఈ ఘనతను సాధించాడు. విండీస్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 51 ప‌రుగులు చేసిన షకీబ్‌.. ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. గ‌తంలో భారత క్రికెట్‌ దిగ్గజం క‌పిల్ దేవ్.. స్వదేశంలో 4 వేల‌కుపైగా ప‌రుగులు, 300కుపైగా వికెట్లు సాధించాడు. 

ఓవరాల్‌గా 340 మ్యాచ్‌లు(56 టెస్టులు, 208 వన్డేలు, 76 టీ20లు) ఆడిన షకీబ్‌.. దాదాపు 12 వేల పరుగులు, 568 వికెట్లును సాధించి, ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా చెలామణి అవుతున్నాడు. బుకీలతో సంప్రదింపులు జరిపాడన్న కార‌ణంగా ఏడాది పాటు నిషేదానికి గురైన ష‌కీబ్‌.. ప్రస్తుత విండీస్‌ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు.  2006లో బంగ్లాదేశ్ త‌ర‌పున అరంగేట్రం చేసిన ష‌కీబ్‌.. 2019 ప్రపంచ క‌ప్‌లో ఆ జట్టు సెమీస్‌కు చేర‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. 

మరిన్ని వార్తలు