"నన్ను డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారు.." ప్రగల్భాలు పలికిన బంగ్లా వికెట్ కీపర్

21 May, 2022 18:59 IST|Sakshi

శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఓ అరుదైన రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (105) చేసిన రహీమ్‌.. టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించానన్న గర్వంతో ఊగిపోతున్న రహీమ్‌ తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌లో తనను క్రికెట్‌ మాంత్రికుడు డాన్‌ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారంటూ రహీమ్‌ ప్రగల్భాలు పలికాడు. 

ఈ సందర్భంగా రహీమ్‌ మాట్లడుతూ.. బంగ్లాదేశ్ తరఫున 5 వేల టెస్టు పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా నిలవడం గర్వంగా ఉంది. అయితే ఈ రికార్డును చాలామంది సీనియర్లు బద్దలు కొడతారు. బంగ్లా జట్టులో 8000, 10000 పరుగులు పూర్తి చేసే ఆటగాళ్లు కూడా ఉన్నారు. నేను బ్యాటింగ్‌ చేస్తుంటే బంగ్లాదేశీలకు బ్రాడ్‌మన్‌లా కనిపిస్తాను. అలా వారు అంటుంటే చాలా గర్వంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు.

బంగ్లాదేశ్‌ తరఫున 81 టెస్టులు ఆడిన ముష్ఫికర్‌ రహీమ్‌ 36.8 సగటున 3 డబుల్‌ సెంచరీలు, 8 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీల సాయంతో 5037 పరుగులు చేశాడు. మరోవైపు ఆసీస్ ఆల్‌టైం గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌ 52 టెస్టుల కెరీర్‌లో 99.94 సగటున 29 సెంచరీల సాయంతో 6996 పరుగులు చేశాడు. ఈ క్రికెట్‌ దిగ్గజంతో రహీమ్‌కు పోలికేంటీ అని నెటిజన్లు బంగ్లాదేశీ వికెట్‌కీపర్‌ను తూర్పారబెడుతున్నారు.
చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్‌ రహీమ్‌ అరుదైన రికార్డు!

మరిన్ని వార్తలు