Mushfiqur Rahim: టీ20లకు గుడ్‌బై చెప్పిన స్టార్‌ క్రికెటర్‌

4 Sep, 2022 13:06 IST|Sakshi

పొట్టి క్రికెట్‌ నుంచి సీనియర్లు వరుసగా వైదొలుగుతుండటంతో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక వరుస పరాజయాల బాట పట్టిన బంగ్లాదేశ్‌కు తాజాగా మరో షాక్‌ తగిలింది. ఆ జట్టు మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌, స్టార్‌ వికెట్‌కీపర్‌ ముష్ఫికర్‌ రహీం.. పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేశాడు. టెస్ట్‌లు, వన్డేలపై ఫోకస్‌ పెట్టేందుకు టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు రహీం వెల్లడించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. 

రహీం.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌ విభాగాల్లో పేలవ ప్రదర్శన (1, 4 పరుగులు) కనబర్చి జట్టు పరాజయాలకు పరోక్ష కారణంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో కీలక సమయంలో క్యాచ్‌ను జారవిడిచి తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడానికి కారణమయ్యాడు.  కాగా, తమ కంటే చిన్న జట్ల చేతుల్లో కూడా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌ ఈ ఏడాది ఇది రెండో షాక్‌ అని చెప్పాలి. ఇదే ఏడాది జులైలో సీనియర్‌ ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ టీ20లకు గుడ్‌బై చెప్పి తొలి షాకివ్వగా.. తాజాగా ముష్ఫికర్‌ బంగ్లాను మరో దెబ్బేశాడు. 

35 ఏళ్ల ముష్ఫికర్‌.. బంగ్లా తరఫున 82 టెస్ట్‌ల్లో 9 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీల సాయంతో 5235 పరుగులు, 236 వన్డేల్లో 8 సెంచరీలు, 42 హాఫ్‌ సెంచరీల సాయంతో 6774 పరుగులు, 102 టీ20ల్లో 115 స్ట్రయిక్‌ రేట్‌తో 6 హాఫ్‌ సెంచరీ సాయంతో 1500 పరుగులు సాధించాడు. వికెట్‌కీపింగ్‌లో రహీం అన్ని ఫార్మాట్లలో కలిపి 449 మందిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. 
చదవండి: 'ఆసియా కప్‌లా లేదు.. బెస్ట్‌ ఆఫ్‌ త్రీ ఆడుతున్నట్లుంది'


 

Poll
Loading...
మరిన్ని వార్తలు