ZIM Vs BAN: బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం.. సిరీస్‌ జింబాబ్వే సొంతం

10 Aug, 2022 21:05 IST|Sakshi

జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో జింబాబ్వేపై 105 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం దక్కింది. ఎందుకంటే ఇప్పటికే జింబాబ్వే మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. కాగా అంతకముందు జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా జింబాబ్వే 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అఫిప్‌ హొసేన్‌ 85 నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. అనాముల్‌ హక్‌ 76, మహ్మదుల్లా 39 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవన్స్‌ 2, ఎల్‌ జాంగ్వే 2, సికిందర్‌ రజా, నగరవా చెరొక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఒక దశలో 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే టెయిలెండర్లు రిచర్డ్‌ నగరావ(34 నాటౌట్‌), విక్టర్‌ న్యౌచిబ్‌(26 పరుగుల) పదో వికెట్‌కు 68 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో మెరిసి జింబాబ్వే పరువును కాపాడారు. కాగా పదో వికెట్‌కు వీరిద్దరు నమోదు చేసిన భాగస్వామ్యం వన్డే క్రికెట్‌ చరిత్రలో పదో స్థానం దక్కించుకుంది. సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన కెప్టెన్‌ సికిందర్‌ రజా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. 

చదవండి: Shikar Dhawan: 'ఆపండి రా నాయనా'.. మీ అతి ప్రేమతో చంపేటట్లున్నారు!

Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన

మరిన్ని వార్తలు