Joe Root: పరిగెత్తుతూ కిందపడ్డాడు; రనౌట్‌కు అవకాశమున్నా..

18 Jul, 2021 13:34 IST|Sakshi

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ టీ20 బ్లాస్ట్‌ క్రికెట్‌లో క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం యార్క్‌షైర్‌, లంకాషైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. లంకాషైర్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో లూక్‌ వెల్స్‌ మిడాఫ్‌ మీదుగా షాట్‌ ఆడి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న స్టీవెన్‌ క్రాప్ట్‌కు కాల్‌ ఇచ్చాడు. అయితే క్రాప్ట్‌ పరుగు కోసం యత్నించి పట్టుతప్పి క్రీజు మధ్యలోనే కిందపడ్డాడు. కాలు పిక్క పట్టేయడంతో క్రాప్ట్‌ నొప్పితో విలవిల్లాడాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్‌ కీపర్‌ హ్యారీ డ్యూక్‌కు అందించాడు.

ఇక్కడ బ్యాట్స్‌మన్‌ రనౌట్‌కు అవకాశమున్నా కెప్టెన్‌ రూట్‌ డ్యూక్‌ను వద్దంటూ వారించాడు. కాగా గాయపడిన క్రాప్ట్‌ను పక్కకు తీసుకెళ్లి ఫిజియోతో చికిత్స చేయించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్‌ చేసిన పనికి నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. కెప్టెన్‌ అనే పదానికి రూట్‌ సరైన నిర్వచనం... ఇది అస‌లైన‌ క్రీడాస్ఫూర్తి.. అంటూ కామెంట్లు పెట్టారు. 


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లంకాషైర్‌ 4 వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ 32, బాలన్స్‌ 31, విల్‌ ప్రెయిన్‌ 22* పరుగులు చేశారు. లంకాషైర్‌ బౌలింగ్‌లో లూక్‌ వుడ్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకాషైర్‌ మరో ఆరు బంతులు మిగిలి ఉండగా.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లంకాషైర్‌ ఇన్నింగ్స్‌లో స్టీవెన్‌ క్రాప్ట్‌ 26 నాటౌట్‌, లూక్‌ వెల్స్‌ 30 పరుగులు చేసి జట్టును గెలిపించారు. 

మరిన్ని వార్తలు