వార్ని.. ఔటవ్వడంలో ఇదో కొత్త స్టైల్‌ అనుకుంటా

30 Sep, 2021 19:35 IST|Sakshi

క్రికెట్‌లో బ్యాటర్స్‌ ఔటయ్యే తీరు ఒక్కోసారి నవ్వులు పూయిస్తుంది. జిడ్డుగా బ్యాటింగ్‌ చేస్తూ ఎంతకీ ఔట్‌ కానీ బ్యాటర్స్‌ ఔటైతే బౌలర్లకు అదో ఆనందం. క్రికెట్‌లో హిట్‌ వికెట్‌ అవడం సహజం.. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన అయబులే గఖమనే అనే ఆటగాడు మాత్రం ఔటవ్వడంలో కూడా కొత్త పద్దతిని చూపెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) ప్రొవిన్షియల్‌ టి20 కప్‌ పేరిట టోర్నీ నిర్వహిస్తుంది.

చదవండి: Kohli Vs Ashwin:ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీపై విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు

ఈ టోర్నీలో భాగంగా మంగళవారం నైట్స్‌, టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గఖమనే ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని లేట్‌కట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అది వైడ్‌ అని తెలిసినప్పటికీ గఖమనే దానిని ఆడాలనుకోవడం అతని మూర్ఖత్వం. అయితే ఇంతలో వికెట్‌ ఎగిరి అవతల పడింది. ఇది చూసిన ప్రత్యర్థి ఆటగాళ్లు మొదట షాకైనప్పటికీ.. తర్వాత నవ్వుకున్నారు. వాస్తవానికి గఖమనే షాట్‌ ఆడే ప్రయత్నంలో వికెట్‌కు దగ్గరగా వెళ్లాడు. దీంతో తనకు తెలియకుండానే హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు.

అయితే అభిమానులు మాత్రం ఈ ఘటనపై ఫన్నీగా స్పందించారు. '' నాకు తెలిసి క్రికెట్‌ చరిత్రలో ఇలా ఔటవ్వడం కాస్త కొత్తగా ఉంది అని ఒకరు పేర్కొంటే.. అంతలేదు.. 1947/48 సమయంలోనే ఆసీస్‌ బ్యాటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ఇదే తరహాలో ఔటయ్యాడు.'' అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో నైట్స్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ 19.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

చదవండి: పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు!

మరిన్ని వార్తలు