T20 Cricket: విజయానికి 35 పరుగులు.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు

18 Jul, 2021 12:24 IST|Sakshi

డబ్లిన్‌: టీ20 క్రికెట్‌ అంటేనే మజాకు పెట్టింది పేరు. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంటుంది. అలాంటిది ఆఖరి ఓవర్‌లో 35 పరుగులు విజయానికి అవసరం అన్నప్పుడు బ్యాటింగ్‌ చేస్తున్న జట్టు ఆశలు వదులుకోవడం సహజం. ఎందుకంటే ఆడిన ప్రతీ బంతిని సిక్స్‌ కొడితే గానీ మ్యాచ్‌ గెలవడం సాధ్యమవుతుంది.అచ్చంగా అదే పరిస్థి‍తిలో దాదాపు ఓటమి అంచున ఉన్న టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు బాలీమెనా బ్యాట్ప్‌మెన్‌ జాన్ గ్లాస్.


క్లబ్‌ క్రికెట్‌లో భాగంగా జాన్‌ గ్లాస్‌ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. అందులోనూ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌.. దాంట్లోను ఆఖరి ఓవర్‌.. అసలు ఒత్తిడి అనే పదాన్ని దరి చేరనీయకుండా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది జాన్‌ గ్లాస్‌ అద్భుతం చేశాడు. ఐర్లాండ్ ఎల్‌వీఎస్‌ టీ20లో క్రెగాగ్, బాలీమెనా మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 147 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో బాలీమెనా 19 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉంది. చివరి ఓవర్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. గ్లాస్(87*) అద్భుతం చేశాడు. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇదే మ్యాచ్‌లో గ్లాస్ సోదరుడు సామ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం.


ఇక టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అనగానే మొదట గుర్తుకు వచ్చేది యువరాజ్‌ సింగ్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 టీ20 ప్రపం‍చకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై కోపంతో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత హర్షలే గిబ్స్‌, కీరన్‌ పొలార్డ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఫీట్‌లే నమోదు చేశారు. అయితే ఒక మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది ఇదే తొలిసారి. ప్రస్తుతం జాన్‌ గ్లాస్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతుంది.

మరిన్ని వార్తలు