European Cricket: మాములు ప్రతీకారం మాత్రం కాదు.. 'అంతకు మించి'

15 Feb, 2022 11:20 IST|Sakshi

క్రికెట్‌లో సెండాఫ్స్‌ ఇచ్చుకోవడం.. దెబ్బకు దెబ్బ తీయడం సర్వ సాధారణం. ఉదాహరణకు.. ఒక బౌలర్‌ తన బౌలింగ్‌లో పదే పదే సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేసి రివేంజ్‌ తీర్చుకోవడం ఒక స్టైల్‌.. లేదంటే అదే బౌలర్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అదే పనిగా విసిగిస్తుంటే.. నోటితో కాకుండా కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వడం మరో స్టైల్‌ రివేంజ్‌. అటు నోటితో.. ఇటు బ్యాటుతో సమాధానం ఇవ్వడం మరో రకమైన ప్రతీకారం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ''అంతకు మించి'' అనకుండా ఉండలేం. 

చదవండి: Viral Video: బంగారం లాంటి అవకాశం వదిలేశాడు..

విషయంలోకి వెళితే.. యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా టన్‌బ్రిడ్జ్‌ వెల్స్‌, డ్రూక్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. టన్‌బ్రిడ్జ్‌ వెల్స్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ను వహిద్‌ అబ్దుల్‌ వేశాడు. అబ్దుల్‌ వేసిన అంతకముందు ఓవర్లో టన్‌బ్రిడ్జ్‌ వెల్స్‌ ఓపెనర్‌ ఓ రియోర్డాన్‌ వరుస బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు. ఇది మనసులో పెట్టుకున్న అబ్దుల్‌ 8వ ఓవర్‌లో ఒక యార్కర్‌ డెలివరీతో రియోర్డాన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో తన కాలికి ఉన్న షూ తీసి నెంబర్‌ డయల్‌ చేసి కాల్‌ మాట్లాడుతూ.. ''నువ్వు వచ్చిన పని ముగిసింది ఇక వెళ్లు'' అంటూ రియోర్డన్‌ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడాడు.

నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ క్రిస్‌ విలియమ్స్‌ ఇదంతా గమనించాడు. 'టైం రాకపోతుందా' అని విలియమ్స్‌ మనుసులో అనుకున్నాడో లేదో.. ఆ అవకాశం రానే వచ్చింది. వహిద్‌ అబ్దుల్‌ మరుసటి ఓవర్లో స్ట్రైకింగ్‌లో ఉన్న విలియమ్స్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సిక్సర్లు కొట్టాడు. అంతే అబ్దుల్‌ వహిద్‌పై ప్రతీకారంగా తన బ్యాట్‌తో నెంబర్‌ కలిపి ఫోన్‌ మాట్లాడుతున్నట్లుగా అబ్దుల్‌ వైపు చూస్తూ..''ఇప్పుడు నీ పని ముగిసింది.. ఇక బౌలింగ్‌కు రాకు'' అంటూ హెచ్చరిక పంపాడు. మొత్తానికి తన జట్టు ఆటగాడిని ఏ విధంగా అయితే అవమానించాడో.. అదే పద్దతిలో కెప్టెన్‌ విలియమ్స్‌ ప్రతీకారం తీర్చుకొని దెబ్బకు దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇలాంటి రివేంజ్‌ ఇంతకముందు చూడలేదు.. వారెవ్వా దెబ్బకు దెబ్బ తీశాడు.. ఇది మాములు ప్రతీకారం మాత్రం కాదు.. అంతకుమించి అంటూ కామెంట్స్‌ చేశారు. 

చదవండి: హిజాబ్‌ వివాదంపై స్పందించిన గుత్తా జ్వాల

ఇక మ్యాచ్‌లో టన్‌బ్రిడ్జ్‌ వెల్స్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టన్‌బ్రిడ్జ్‌వెల్‌ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్‌ విలియమ్స్‌(56), అలెక్స్‌ విలియమ్స్‌(58) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన డ్రూక్స్‌ 7.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్‌ అయింది. జో మెక్‌కాఫ్రీ 9 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు