BBL 2022-23: ఫించ్‌ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..!

22 Jan, 2023 18:49 IST|Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో భాగంగా ఇవాళ (జనవరి 22) పెర్త్‌ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (35 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. స్కార్చర్స్‌ నిర్ధేశించిన 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫించ్‌ వీరోచితంగా పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫించ్‌కు జతగా షాన్‌ మార్ష్‌ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్‌), విల్‌ సదర్‌లాండ్‌ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్‌) పోరాడినప్పటికీ మెల్‌బోర్న్‌ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఫించ్‌ చాలా రోజుల తర్వాత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బంతిని ఇష్టం వచ్చినట్లు బాదుతూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 31 పరుగులు పిండుకుని ప్రత్యర్ధిని గడగడలాడించాడు.

అయితే 19వ ఓవర్‌లో కేవలం 8 పరుగులే రావడంతో మెల్‌బోర్న్‌ ఓటమి ఖరారైంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని ఫించ్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ఎడాపెడా ఫోర్‌, సిక్సర్‌ బాది 18 పరుగులు రాబట్టాడు. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో 202/5 స్కోర్‌ వద్ద ఆగిపోయింది. పెర్త్‌ బౌలర్లలో టర్నర్‌ 2, డేవిడ్‌ పెయిన్‌, ఆండ్రూ టై, ఆరోన్‌ హర్డీ తలో వికెట్‌ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌.. ఓపెనర్లు స్టీవీ ఎస్కినాజీ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), బాన్‌క్రాఫ్ట్‌ (50 బంతుల్లో 95 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఈ గెలుపుతో పెర్త్‌ పాయింట్ల పట్టికతో అగ్రస్థానాన్ని (14 మ్యాచ్‌ల్లో 11 విజయాలతో 22 పాయిం‍ట్లు) మరింత పటిష్టం చేసుకుంది. మెల్‌బోర్న్‌ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని నాలుగో స్థానంలో ఉంది. సిడ్నీ సిక్సర్స్‌ (19 పాయింట్లు), బ్రిస్బేన్‌ హీట్‌ (13), సిడ్నీ థండర్‌ (12), అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ (10), హోబర్ట్‌ హరికేన్స్‌ (10), మెల్‌బోర్న్‌ స్టార్స్‌ (6) వరుసగా 2, 3, 5, 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు