BBL 2022-23: హ్యాట్రిక్‌ వృధా.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించిన రసెల్‌

21 Dec, 2022 21:08 IST|Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనగేడ్స్‌, బ్రిస్బేన్‌ హీట్‌ జట్లు ఇవాళ (డిసెంబర్‌ 21) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్‌ హీట్‌.. టామ్‌ రోజర్స్‌ (4/23), అకీల్‌ హొసేన్‌ (3/26) ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (1/18) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో మ్యాట్‌ రెన్షా (29), సామ్‌ బిల్లింగ్స్‌ (25), పీయర్సన్‌ (45) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

అనంతరం 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ టీమ్‌ను ఫాస్ట్‌ బౌలర్‌ మైఖేల్‌ నెసర్‌ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టి (4/32) భయపెట్టాడు. తొలి ఓవర్‌ తొలి బంతికే వికెట్‌ పడగొట్టిన నెసర్‌.. అదే ఓవర్‌ ఆఖరి బంతికి మరో వికెట్‌ను, ఆతర్వాత మూడో ఓవర్‌ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. నెసర్‌ ధాటికి మెల్‌బోర్న్‌ 2.2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది.

అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన విండీస్‌ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్‌ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఆరోన్‌ ఫించ్‌ (43 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), అకీల్‌ హొసేన్‌ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. అర డజన్‌ సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్‌ ప్రత్యర్ధి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ను 4 వికెట్ల తేడాతో గెలిపించాడు.

రసెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ హవాలో నెసర్‌ హ్యాట్రిక్‌ వృధా అయిపోయింది. బ్రిస్బేన్‌ బౌలర్లలో నెసర్‌తో పాటు మార్క్‌ స్టీకీట్‌ (2/23) వికెట్లు దక్కించుకున్నాడు. జేమ్స్‌ బాజ్లే బౌలింగ్‌లో రసెల్‌ కొట్టిన 103 మీటర్ల సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనగేడ్స్‌ జట్టు 1400 రోజుల తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. 
 

మరిన్ని వార్తలు