BBL 2022-23: స్టీవ్‌ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు

17 Jan, 2023 15:58 IST|Sakshi

BBL 2022-23: టెస్ట్‌ ఆటగాడిగా ముద్రపడ్డ ఆస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్‌ స్మిత్‌.. పొట్టి ఫార్మాట్‌లోనూ చెలరేగాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మిత్‌.. ఇవాళ (జనవరి 17) అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంకర శతకంతో రెచ్చిపోయాడు. కేవలం 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో ఆది నుంచి దూకుడుగా ఆడిన స్మిత్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయి, తన శైలికి భిన్నంగా ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. స్మిత్‌కు ఇది బీబీఎల్‌లో మొదటి శతకం కాగా, బీబీఎల్‌ చరిత్రలో సిడ్నీ సిక్సర్స్‌కు కూడా ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా బీబీఎల్‌లో ఇది 35వ సెంచరీ కాగా.. ఈ సెంచరీతో బీబీఎల్‌లో పాల్గొనే అన్ని జట్లు సెంచరీలు నమోదు చేసినట్లైంది. ఐపీఎల్‌లోనూ తన పేరిట సెంచరీ నమోదు చేసుకున్న స్మిత్‌.. స్వదేశంలో జరుగుతున్న బీబీఎల్‌లో ఈ ఫీట్‌ అందుకునేందుకు 12 ఏళ్లు పట్టింది. 

కాగా, అడిలైడ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో స్మిత్‌ విధ్వంసకర శతకానికి తోడు కర్టిస్‌ ప్యాటర్సన్‌ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, సిక్స్‌), సిల్క్‌ (16 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించడంతో సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అడిలైడ్‌ బౌలర్లలో వెస్‌ అగర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. షార్ట్‌, బాయ్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్‌.. 5 ఓవర్ల తర్వాత  వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. కెప్టెన్‌ ట్రవిస్‌ హెడ్‌ (5) ఔట్‌ కాగా.. అలెక్స్‌ క్యారీ (7), మాథ్యూ షార్ట్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు.  


 

మరిన్ని వార్తలు