-

BBL 2022-23: స్టీవ్‌ స్మిత్‌కు ఏమైంది, అస్సలు ఆగట్లేదు.. మరోసారి విధ్వంసం

23 Jan, 2023 16:34 IST|Sakshi

Steve Smith: బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌, సిడ్నీ సిక్సర్స్‌ ఓపెనర్‌ స్టీవ్‌ వీర విధ్వంసకర ఫామ్‌ కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్‌లో ఓపెనర్‌ అవతారమెత్తిన స్మిత్‌.. వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. టెస్ట్‌ క్రికెటర్‌గా ముద్రపడిన స్టీవ్‌ ఈ సీజన్‌లో ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారి, ఊచకోత అన్న పదానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌లా మారాడు.

గత నాలుగైదు ఇన్నింగ్స్‌లుగా పట్టపగ్గాలు లేకుండా ఎడాపెడా సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు బాదుతున్న స్మిత్‌.. ఇవాళ (జనవరి 23) హోబర్ట్‌ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.

తానాడిన గత రెండు మ్యాచ్‌ల్లో (అడిలైడ్‌ స్ట్రయికర్స్‌పై 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు, సిడ్నీ థండర్స్‌పై 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 125 నాటౌట్‌) సునామీ శతకాలతో చెలరేగిన స్మిత్‌.. ఇవాళ మరో మెరుపు హాఫ్‌ సెంచరీ బాదాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. స్మిత్‌ తన హాఫ్‌ సెంచరీని కేవలం 22 బంతుల్లో పూర్తి చేశాడు. అతని టీ20 కెరీర్‌లో ఇదే వేగవంతమై హాఫ్‌ సెంచరీ కావడం విశేషం.

స్మిత్‌తో పాటు హెన్రిక్స్‌ (23 నాటౌట్‌), వార్షుయిస్‌ (30) ఓ మోస్తరుగా రాణించడంతో సిక్సర్స్‌ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్‌.. నిర్ణీత ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి, 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

కాగా, స్టీవ్‌ స్మిత్‌ తన సహజ సిద్దమైన ఆటకు భిన్నంగా చెలరేగుతుండటం పట్ల క్రికెట్‌ సర్కిల్స్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ స్మిత్‌కు ఏమైంది.. ఒక్కసారిగా గేర్‌ మార్చేశాడు.. బ్రేకులు వేసే ప్రయత్నాలు చేసినా ఆగట్లేదు అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కెరీర్‌లో ఎన్నడూ లేనంతంగా స్పీడ్‌ను పెంచిన స్మిత్‌ నుంచి భవిష్యత్తులో మరిన్ని సునామీ ఇన్నింగ్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చని అతని అభిమానులు చర్చించుకుంటున్నారు. 12 ఏళ్ల బీబీఎల్‌ కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్‌ కేవలం 5 రోజుల వ్యవధిలో రెండు విధ్వంసకర సెంచరీలు, ఓ మెరుపు హాఫ్‌ సెంచరీ బాదడంతో ఆసీస్‌ అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోతున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్‌.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం. 


 

మరిన్ని వార్తలు