Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్‌.. లీగ్‌ నుంచి వైదొలిగిన క్రికెటర్‌

22 Dec, 2022 11:17 IST|Sakshi
కూతురితో టైమల్‌ మిల్స్‌(PC: Instagram)

Tymal Mills- Big Bash League: ‘‘భారమైన 11 రోజుల తర్వాత క్రిస్‌మస్‌ కోసం ఇలా ఇంటికి! ఆస్ట్రేలియా వెళ్లేందుకు మేము ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో మా చిన్నారి కూతురికి పక్షవాతం వచ్చింది. తన శరీరంలోని ఎడమభాగం పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్లింది. తను కోలుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళనపడ్డాం.

అయితే, మా చిన్నారి దేవత.. కఠిన పరిస్థితులను అనతికాలంలోనే అధిగమించి అందరిని ఆశ్చర్యపరిచింది. తనను తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. కానీ, డిశ్చార్జ్‌ కావడానికి ముందు తను ఎంత వేదన అనుభవించిందో మాకు తెలుసు. ఇప్పుడైతే మేము సంతోషంగానే ఉన్నాం. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ టైమల్‌ మిల్స్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

అనారోగ్యం బారిన పడిన తమ కూతురు కోలుకుందనే శుభవార్తను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. కాగా బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడేందుకు టైమల్‌ మిల్స్‌ ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన సమయంలో అతడి రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్‌ వచ్చింది. ఈ విచారకర ఘటన నేపథ్యంలో మిల్స్‌ తను కుటుంబంతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో ఈ ఫాస్ట్‌బౌలర్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలిగాడు. కాగా 30 ఏళ్ల మిల్స్‌ ఈ సీజన్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. అయితే, దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు.

అతడి స్థానంలో డేవిడ్‌ పైన్‌ ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ తరఫున ఆడనున్నాడు. ఇక మిల్స్‌ సహా ఫిల్‌ సాల్ట్‌, లౌరీ ఎవాన్స్‌ తదితరులు వివిధ కారణాల దృష్ట్యా జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పెర్త్‌ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడింది.

చదవండి: Ind Vs Ban: పట్టుదల, శ్రమ.. అవునా?.. మంచిది! మరి కుల్దీప్‌ సంగతేంటి?! నెటిజన్ల ఫైర్‌
BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌! కిట్‌ స్పాన్సర్‌ కూడా! కారణం?

మరిన్ని వార్తలు