BBL: సంచలన క్యాచ్‌.. బిక్క ముఖం వేసిన బ్యాటర్‌! ఇంతకీ అది సిక్సరా? అవుటా?

2 Jan, 2023 12:59 IST|Sakshi
నీసర్‌ సంచలన క్యాచ్‌.. (PC: CA Twitter)

Big Bash League 2022-23- Sensational Catch: బిగ్‌బాష్‌ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ క్రికెటర్‌ మైఖేల్‌ నీసర్‌ అందుకున్న క్యాచ్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఇంతకీ అది.. అవుటా? కాదా’’ అన్న అంశంపై చర్చ నడుస్తోంది. కొంతమందేమో ఇదో గొప్ప క్యాచ్‌ అని నీసర్‌ను ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలా కూడా అవుట్‌ ఇస్తారా అని అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ సిక్సర్స్‌, బ్రిస్బేన్‌ హీట్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన హీట్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ.. గెలుపు కోసం తీవ్రంగా పోరాడింది. అయితే, 209 పరుగులకు ఆలౌట్‌ కావడంతో బ్రిస్బేన్‌ హీట్‌ 15 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. అయితే, సిడ్నీ ఫ్యాన్స్‌ మాత్రం తమ జట్టు మిడిలార్డర్‌ ఆటగాడు జోర్డాన్‌ సిల్క్‌ అవుట్‌ కాకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు​ వద్ద సిల్క్‌ పెవిలియన్‌ చేరాడు. హీట్‌ బౌలర్‌ స్టీకెటీ బౌలింగ్లో మైకేల్‌ నాసర్‌ పట్టిన సంచలన క్యాచ్‌ కారణంగా అవుటయ్యాడు.

పందొమ్మిదో ఓవర్‌ రెండో బంతిని సిల్క్‌ షాట్‌ ఆడే క్రమంలో లాంగాఫ్‌లో నీసర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్‌ కోల్పోయిన నీసర్‌ బౌండరీ దాటే సమయంలో బాల్‌ను గాల్లోకి ఎగిరేశాడు. బౌండరీ అవతల బంతి గాల్లో ఉండగా.. తన అడుగులు కిందపడకుండా.. బంతిని ఒడిసిపట్టి.. మళ్లీ ఇవతలకు విసిరేసి.. బౌండరీ దాటి క్యాచ్‌ పట్టేశాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  కొంతమంది దీనిని అవుట్‌ ఇవ్వడం కరెక్టే అంటూ ఉండగా.. మరికొందరు మాత్రం పాపం సిల్క్‌ అంటూ జాలిపడుతున్నారు. అది సిక్సరా లేదంటే అవుటా అన్న విషయం తేల్చలేక ఇంకొందరు అయోమయంలో పడిపోయారు. అది సిక్సర్‌ అయి ఉంటే సిల్క్‌ తమ జట్టును తప్పక విజయతీరాలకు చేర్చేవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిబంధనల ప్రకారం.. బౌండరీ లైన్‌ అవతల క్యాచ్‌ అందుకునే, దానిని విసిరేసే సమయంలో ఫీల్డర్‌ గ్రౌండ్‌కు టచ్‌ కాక.. ఇవతల బాల్‌ను అందుకుంటే అది క్యాచే!

చదవండి: BCCI: కీలక టోర్నీల్లో వైఫల్యాలు.. భారీ మూల్యం! ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు?
WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్‌ సైన్యం

మరిన్ని వార్తలు