క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

18 Apr, 2021 18:43 IST|Sakshi

ముంబై: క్రికెట్‌ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారయ్యింది. విశ్వక్రీడల వేదికపై(ఒలింపిక్స్‌) జెంటిల్‌మెన్‌ గేమ్‌కు ఓకే చెబుతూ, బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించడంపై బీసీసీఐ ఇన్నాళ్లూ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే తాజాగా బీసీసీఐ అందుకు అంగీకరించడంతో 2028 లాస్ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో  పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌ను విశ్వవేదికపై వీక్షించేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. అంతేకాకుండా వ‌చ్చే ఏడాది జ‌రుగ‌బోయే కామ‌న్వెల్త్ క్రీడల్లో మ‌హిళ‌ల క్రికెట్‌ ప్రాతినిధ్యానికి కూడా బోర్డు అంగీక‌రించింది. 

కాగా, చివరిసారిగా 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం దక్కింది. అప్పటి నుంచి వివిధ కారణాల చేత విశ్వక్రీడల వేదికపై క్రికెట్‌ను ప్రాతినిధ్యం లభించలేదు. బీసీసీఐ తమ స్వ‌యంప్రతిపత్తిని కోల్పోతామేమోనన్న భయంతో ఇన్నాళ్లూ ఈ అంశాన్ని మూలన పెట్టేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేరిస్తే.. ఇండియ‌న్ ఒలింపిక్ క‌మిటీకి ఎక్క‌డ జ‌వాబుదారీగా ఉండాల్సి వ‌స్తుందోనన్న ఆందోళ‌న‌ బీసీసీఐలో ఉండేది. అయితే ప్రస్తుతం బోర్డు తీరులో మార్పు రావడంతో తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అంశానికి సానుకూలంగా స్పందించింది. ఐసీసీతో జ‌రిగిన స‌మావేశంలో బీసీసీఐ ఈ అంశంపై సమ్మతిని వ్యక్తం చేసినట్లు బోర్డు కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ వెల్లడించారు. అయితే ఈ అంశానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.
చదవండి: అపురూపమైన కానుకతో స్టోక్స్‌కు వీడ్కోలు..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు