ఐపీఎల్‌ కొత్త టైటిల్‌ స్పాన్సర్‌ ఎవరు?

6 Aug, 2020 17:17 IST|Sakshi

2020 సీజన్‌ నుంచి వివో ఔట్‌

వివో స్వీయ నిర్ణయానికి బీసీసీఐ ఓకే

కొత్త స్పాన్సర్‌ వేటలో బోర్డు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)టైటిల్‌ స్పాన్సర్‌గా ఉండలేమన్న వివో అభ్యర్థనను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) మన్నించింది. గురువారం వివోతో కటీఫ్‌కు ‌భారంగానే ఓకే చెబుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు చైనా యాప్‌లను భారత ప్రభుత్వం  నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో వివోను బీసీసీఐ కొనసాగించడం పెద్ద దుమారం లేచింది. అటు రాజకీయ విమర్శలతో పాటు ఇటు సోషల్‌ మీడియాలో సైతం బీసీసీఐ తీరును ఎండగడుతూ పోస్టులు పెట్టారు. దాంతో వివోనే సొంతంగా తప్పుకోవడానికి నిర్ణయించుకుంది. ఇదే ప్రతిపాదనను బీసీసీఐ ముందుంచగా దానికి ఎట్టకేలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది.

అయితే కొత్త టైటిల్‌ స్పాన్సర్‌ వేటలో పడింది బీసీసీఐ. ఐపీఎల్‌  నిర్వహణకు ఇంకో నెల మాత్రమే సమయం ఉండటంతో టైటిల్‌ స్పాన్సర్‌ను ఎంపిక చేసుకోవడం బీసీసీఐకి సవాల్‌గా మారింది. వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ప్రారంభం కానున్న తరుణంలో టైటిల్‌ స్పాన్సర్‌ కోసం వెతుకులాట ఆరంభించాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం ఎవరు ముందుకొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టైటిల్‌ స్పాన్సర్‌ కోసం ఎవరైనా వచ్చినా తక్కువ మొత్తంలోనే దానికి డీల్‌ కుదుర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. (కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తా: ఆసీస్‌ కెప్టెన్‌)

2008లో ఐపీఎల్‌ మొదలైన తర్వాత ముందుగా డీఎల్‌ఎఫ్, ఆ తర్వాత పెప్సీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే స్పాట్‌ ఫిక్సింగ్‌ అనంతరం వచ్చి న వివాదాలతో పెప్సీ అర్ధాంతరంగా తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోగా మధ్యలో రెండేళ్ల కాలానికి ‘వివో’ స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2017లో బోర్డుతో వివో ఐదేళ్ల కాలానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2018–2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్‌కు రూ. 2199 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే పూర్తి కాగా, మూడో ఏడాదే సమస్యలు తలెత్తాయి. చైనాతో విభేదాల కారణంగా ఆ దేశానికి చెందిన కంపెనీలపై భారత్‌ దృష్టి పెట్టిన నేపథ్యంలో వివో అందులో చేరింది. ఈ క్రమంలోనే విమర్శల దాటిని తట్టుకోలేక వివో స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మొగ్గుచూపింది. దీనిపై బీసీసీఐ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపిన పిదప చేసేది లేక అంగీకారం తెలిపారు.

ఇప్పటికే టీమిండియా కిట్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం బిడ్‌లు ఆహ్వానించిన బీసీసీఐ.. ఇప్పుడు ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ కోసం వేట ప్రారంభించాల్సి ఉంది.  దీనికి బిడ్‌లు వేస్తారా లేక ఏ సంస్థకైనా తమ ఇష్టప్రకారం టైటిల్‌ స్పాన్సర్‌ హక్కులు ఇస్తారా అనేది చూడాలి.  ఇది ఈ ఏడాదికే అని చెబుతున్నా రాబోవు సీజన్‌లో కూడా వివోతో బీసీసీఐ ఎంతవరకూ జోడి కడుతుందా అనే ప్రశ్న కూడా మొదలవుతుంది. ఇరు దేశాల మధ్య ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి తొందరగా ముగింపు దొరుకుతుందనుకుంటే పొరపాటు. చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం చూస్తున్న సమయంలో వివోతో మళ్లీ ఒప్పందం అనేది ఉంటుందా అనేది క్రికెట్‌ అభిమానులకు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఒకవేళ వివోతో ఒప్పందం ఓవరాల్‌గా రద్దయితే మాత్రం బీసీసీఐ భారీ మొత్తంలోనే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌కు వెళుతున్న బీసీసీఐ.. ఎంతకొంతా ఉపశమనం పొందినా పూర్తిస్థాయి లాభాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చూడలేదు. ఇటువంటి తరుణంలో వివో తప్పుకోవడం బీసీసీఐకి మరో దెబ్బ. అయినప్పటికీ ప్రపంచ ధనిక క్రికెట్‌ బోర్డుల్లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న బీసీసీఐకి ఈ నష్టం నుంచి బయటపడటానికి కూడా ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇదిలా ఉంచితే, అనేక సమస్యల మధ్య ఐపీఎల్‌కు వెళుతున్న బీసీసీఐ.. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఎంతవరకూ సక్సెస్‌ ముగిస్తుందనే విషయంలో కూడా ఆసక్తి ఏర్పడింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీ.. ఐపీఎల్‌ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే అందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. బయో సెక్యూర్‌ విధానంలో ఐపీఎల్‌ను సమర్థవంతంగా నిర్వహించడం అనేది ఇప్పుడు బీసీసీఐ ముందున్న చాలెంజ్‌.

మరిన్ని వార్తలు