విహారి, షమీ, జడేజా పునరాగమనం

8 May, 2021 02:11 IST|Sakshi

20 మందితో భారత టెస్టు జట్టు ప్రకటన

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు ఎంపిక

మరో నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లు కూడా

భువనేశ్వర్, కుల్దీప్‌లకు దక్కని చోటు   

ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆటగాళ్లపైనే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు నమ్మకం ఉంచారు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంపిక చేయకపోవడం మినహా ఎలాంటి అనూహ్యత లేకుండా అంచనాల ప్రకారమే జట్టు ఎంపిక సాగింది. కరోనా నేపథ్యంలో అదనంగా మరో నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లు ప్రధాన జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు వెళతారు.

ముంబై: సుమారు మూడు నెలల పాటు సాగే ఆరు టెస్టు మ్యాచ్‌ల ఇంగ్లండ్‌ పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని ఈ టీమ్‌కు అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మొత్తం 20 మందిని ఎంపిక చేసిన కమిటీ మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలుగా ప్రకటించింది. ఈ టూర్‌లో జూన్‌ 18 నుంచి సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో తొలి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే టీమిండియా... ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పోటీపడుతుంది. క్వారంటైన్‌ తదితర నిబంధనలు దృష్టిలో ఉంచుకొని భారత జట్టు జూన్‌ 2న ఇంగ్లండ్‌ బయలుదేరే అవకాశం ఉంది.  

ముగ్గురు వచ్చేశారు...
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ గాయపడగా... సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా గాయపడ్డారు. ఈ ముగ్గురు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు వీరు తాజా పర్యటనతో టెస్టు టీమ్‌లోకి పునరాగమనం చేస్తున్నారు. విహారి ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్నాడు. వార్విక్‌షైర్‌ క్లబ్‌ జట్టు తరఫున అతను కౌంటీల్లో ఆడుతున్నాడు.  

ఉమేశ్‌కు మరో చాన్స్‌...
పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ప్రధాన బౌలర్లు ఇషాంత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, షమీలతో పాటు తాజా ఫామ్‌ను బట్టి మొహమ్మద్‌ సిరాజ్‌కు సహజంగానే చోటు లభించింది. మరో ఇద్దరు పేసర్లు కూడా టీమ్‌లో ఉన్నారు. మెల్‌బోర్న్‌ టెస్టు తర్వాత అవకాశం దక్కని ఉమేశ్‌ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అతనితో పాటు బ్రిస్బేన్‌ టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన శార్దుల్‌ ఠాకూర్‌కు కూడా చోటు లభించింది.

వీరిద్దరు కూడా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌ కుమార్‌ను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌కు ముందు అతను ఇంగ్లండ్‌తో టి20, వన్డేలు ఆడాడు. ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితుల్లో భువీ తన స్వింగ్‌ బౌలింగ్‌తో మంచి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అతనికి స్థానం ఖాయమనిపించింది. అయితే సెలక్టర్లు మరోలా ఆలోచించారు. పదే పదే ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న భువీపై సెలక్టర్లు నమ్మకం ఉంచలేకపోయారు. ఆసీస్‌ గడ్డపై రెండు టెస్టులు ఆడిన నవదీప్‌ సైనీని కూడా ఎంపిక చేయలేదు. 

 

కుల్దీప్‌ యాదవ్‌పై వేటు...
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఫిట్‌గా ఉంచేందుకే హార్దిక్‌ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్‌ చేయనీయడం లేదని కెప్టెన్‌ కోహ్లి పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ ఐపీఎల్‌లో ఒక్క బంతి కూడా వేయలేదు. అయితే చివరకు అతనికీ టెస్టు అవకాశం దక్కలేదు. తాజా ఫిట్‌నెస్‌తో హార్దిక్‌ బౌలింగ్‌ చేయడం కష్టమని సెలక్టర్లు భావించారు. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై కూడా వేటు పడింది.

గత రెండేళ్లలో ఒకే ఒక టెస్టులో ఆడే అవకాశం లభించిన కుల్దీప్‌ (ఇంగ్లండ్‌తో రెండో టెస్టు) మొత్తం కలిపి 12.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు. టాప్‌ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఉండగా అవసరమైతే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తనను తాను నిరూపించుకున్న అక్షర్‌ పటేల్‌ (27 వికెట్లు) కూడా ఎంపికయ్యాడు. కాబట్టి కుల్దీప్‌కు తుది జట్టులో స్థానం కష్టం కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో కూడా చెలరేగినా... పృథ్వీ షాను టెస్టుల కోసం సెలక్టర్లు పరిశీలనలోకి తీసుకోకపోవడం గమనార్హం.  

ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే...
బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా 20 మంది సభ్యుల బృందంలోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరు బయలుదేరేలోపు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రాహుల్‌కు ఇటీవలే అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ జరగ్గా... సాహా కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. సాహాకు ప్రస్తుతం కరోనా చికిత్స కొనసాగుతోంది. అతను ఇంకా కోలుకోలేదు.  

ఆ నలుగురు...

ప్రసిధ్‌ కృష్ణ: ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు తరఫున ఆడినప్పుడు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కర్ణాటక బౌలర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసిన అతను 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 20.26 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు.  
అవేశ్‌ ఖాన్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అవేశ్‌కు ఆరేళ్ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ ఉంది. 26 మ్యాచ్‌లలో అతను 23.01 సగటుతో 100 వికెట్లు తీశాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో అతని ఆట ఎంతో మెరుగుపడింది. తాజా ఐపీఎల్‌లోనూ అది కనిపించింది.  
అభిమన్యు ఈశ్వరన్‌: రంజీల్లో ప్రతీ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్నా దురదృష్టవశాత్తూ ఈ బెంగాల్‌ ఓపెనర్‌కు ఇప్పటి వరకు టీమిండియా పిలుపు రాలేదు. 64 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో అతను 43.57 సగటుతో 4,401 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి.  
అర్జాన్‌ నాగ్వాస్‌వాలా: గుజరాత్‌కు చెందిన లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌. 16 మ్యాచ్‌లలో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. 2019–20 రంజీ సీజన్‌లో 41 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న ఏకైక ‘పార్సీ’ ఆటగాడు అతనే కావడం విశేషం.

భారత జట్టు
కోహ్లి (కెప్టెన్‌), రహానే (వైస్‌ కెప్టెన్‌), రోహిత్, గిల్, మయాంక్, పుజారా, విహారి, పంత్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, శార్దుల్, ఉమేశ్, రాహుల్, సాహా.
స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్, అర్జాన్‌ నాగ్వాస్‌వాలా

మరిన్ని వార్తలు