Womens Asia Cup 2022: ఆసియా కప్‌కు టీమిండియా మహిళల జట్టు.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే?

21 Sep, 2022 12:20 IST|Sakshi

అక్టోబర్‌ ఒకటి నుంచి జరగనున్న మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీకి బీసీసీఐ టీమిండియా జట్టును బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు హర్మన్‌ప్రీత్‌ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మందాన వైస్‌ కెప్టెన్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో భారత మహిళల జట్టులో ఉన్న ఆటగాళ్లలో దాదాపు అందరూ ఆసియా కప్‌ టోర్నీకి ఎంపికయ్యారు.

గాయంతో ఇంగ్లండ్‌ టూర్‌కు దూరమైన జెమిమా రోడ్రిగ్స్‌ తిరిగి జట్టులోకి వచ్చింది. రేణుకా సింగ్‌, మేఘనా సింగ్‌, పూజా వస్రాకర్‌లు పేస్‌ బాధ్యతలు మోయనుండగా.. రాజేశ్వరి గైక్వాడ్‌, రాదా యాదవ్‌, స్నేహ్‌ రాణాలు స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ సేవలందించనుంది. బ్యాటింగ్‌లో స్మృతి మందాన, షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దయాలన్‌ హేమలత, కేపీ నేవిగర్‌లు బ్యాటర్లుగా ఎంపిక చేసింది. ఇక తాంతియా బాటియా, సిమ్రన్‌ దిల్‌ బహుదూర్‌లను స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది.

మహిళల ఆసియా కప్‌ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు జై షా మంగళవారం విడుదల చేశారు. ఇక అక్టోబర్‌ 1న బంగ్లాదేశ్‌ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఏడు జట్లు పోటీపడుతున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, యూఏఈ, థాయ్‌లాండ్‌, మలేషియాలు మొదట రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో తలపడుతాయి. వీటిలో టాప్‌-4లో నిలిచిన జట్లు సె​మీస్‌కు చేరుతాయి.  టీమిండియా మహిళలు టోర్నీలో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 1న శ్రీలంకతో ఆడనుంది. ఆపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్‌ 7న తలపడనుంది.  ఆ తర్వాత అక్టోబర్‌ 8న బంగ్లాదేశ్‌తో, 10న థాయ్‌లాండ్‌తో ఆడనుంది.

ఆసియాకప్‌కు టీమిండియా మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి వస్త్రాకర్, పూజా వస్త్రాకర్ గయాక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవగిరే

స్టాండ్‌బై ప్లేయర్‌లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్

చదవండి: ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు!

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.. హెచ్‌సీఏలో టికెట్ల రగడ

మరిన్ని వార్తలు