షఫాలీ, రాజేశ్వరి, పూనమ్‌ రౌత్‌లకు ప్రమోషన్‌

20 May, 2021 06:02 IST|Sakshi

గ్రేడ్‌ ‘సి’ నుంచి ‘బి’లోకి చోటు

బీసీసీఐ 2020–2021 మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ల ప్రకటన

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించింది. గత ఏడాది కాంట్రాక్ట్‌లలో 22 మంది ఉండగా... ఈసారి దానిని 19 మందికి పరిమితం చేశారు. వార్షిక కాంట్రాక్ట్‌ ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గ్రేడ్‌ ‘ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు... గ్రేడ్‌ ‘బి’ వారికి రూ. 30 లక్షలు... గ్రేడ్‌ ‘సి’ వారికి రూ. 10 లక్షలు లభిస్తాయి. గత ఏడాది కాంట్రాక్ట్‌ పొందిన ఏక్తా బిష్త్, వేద కృష్ణమూర్తి, హేమలత, అనూజా పాటిల్‌లకు ఈసారి స్థానం లభించలేదు. టీనేజ్‌ క్రికెటర్‌ షఫాలీ వర్మ, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్, ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌లకు ప్రమోషన్‌ లభించింది. ఈ ముగ్గురు గ్రేడ్‌ ‘సి’ నుంచి గ్రేడ్‌ ‘బి’లోకి వచ్చారు. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ గ్రేడ్‌ ‘బి’లోనే కొనసాగనుండగా... బెంగాల్‌ అమ్మాయి రిచా ఘోష్‌కు తొలిసారి కాంట్రాక్ట్‌ దక్కింది.  

గ్రేడ్‌ ‘ఎ’ (రూ. 50 లక్షల చొప్పున): హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌.
గ్రేడ్‌ ‘బి’ (రూ. 30 లక్షల చొప్పున): మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా, జెమీమా రోడ్రిగ్స్‌.
గ్రేడ్‌ ‘సి’ (రూ. 10 లక్షల చొప్పున): అరుంధతి రెడ్డి, మాన్సి జోషి, పూజా వస్త్రకర్, హర్లీన్‌ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్‌.

మరిన్ని వార్తలు