నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ

4 Jul, 2021 04:55 IST|Sakshi

ముంబై: కరోనా కారణంగా గత ఏడాది రంజీ ట్రోఫీతోపాటు పలు వయో పరిమితి విభాగం టోర్నీలను నిర్వహించలేకపోయిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. 2021–2022 దేశవాళీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం విడుదల చేశారు. ‘దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 21న సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌తో మొదలవుతుంది. 2022 ఏప్రిల్‌ 11న సీనియర్‌ మహిళల టి20 లీగ్‌తో ముగుస్తుంది’ అని జై షా తెలిపారు. ఇక ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టోర్నీ నవంబర్‌ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు జరుగుతుంది.

ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీని అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 12 వరకు... విజయ్‌ హజారే ట్రోఫీ వన్టే టోర్నీని 2022 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు నిర్వహిస్తారు. వీటితోపాటు అండర్‌–23 కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీని , అండర్‌–19 వినూ మన్కడ్‌ ట్రోఫీ, అండర్‌–16 కూచ్‌ బిహార్‌ ట్రోఫీ, విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ టోర్నీలు కూడా జరుగుతాయి. సీనియర్, జూనియర్‌ పురుషుల, మహిళల విభాగాల టోర్నీలన్నింటిలో కలిపి మొత్తం 2,127 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఇరానీ కప్, దులీప్‌ ట్రోఫీ (ఇంటర్‌ జోనల్‌), దేవధర్‌ ట్రోఫీ మ్యాచ్‌లను నిర్వహించడం లేదు. మరోవైపు దేశవాళీ క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు పెంచే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్‌ (మూడు లేదా నాలుగు రోజులు) మ్యాచ్‌ల్లో ఆడేవారికి మ్యాచ్‌కు రూ. లక్షా 40 వేలు.. లిస్ట్‌–ఎ, టి20 మ్యాచ్‌ల్లో ఆడేవారికి మ్యాచ్‌కు రూ. 35 వేలు లభిస్తున్నాయి.   
ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

మరిన్ని వార్తలు