సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చెయ్యొచ్చు

17 Sep, 2022 15:58 IST|Sakshi

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్‌) ప్రారంభంకానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' అనే నయా రూల్‌ను అమల్లోకి తేనుంది. ఈ రూల్‌ అమల్లోకి వస్తే ఇన్నింగ్స్‌ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు లభిస్తుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం.. ఇన్నింగ్స్‌ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్‌ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతని స్థానంలో మరో ఆటగాడు (సబ్‌స్టిట్యూట్‌) బరిలోకి దిగుతాడు. 

ఇక్కడ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్‌ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం​ అయితే  బౌలింగ్‌ చేసే జట్టులో ఇన్నింగ్స్‌ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్‌ అప్పటి స్థితిగతులను బట్టి ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్‌ ముగిశాక కెప్టెన్‌ లేదా హెడ్‌ కోచ్‌ లేదా మేనేజర్‌లలో ఎవరో ఒకరు ఫీల్డ్‌ అంపైర్‌ లేదా ఫోర్త్‌ అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే ఛాన్స్‌ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. 

అదే బ్యాటింగ్‌ చేసే జట్టు వికెట్‌ పడ్డాక ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ గురించి అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందుకోసం ఇరు జట్లు టాస్‌ సమయంలో ప్లేయింగ్‌ ఎలెవెన్‌తో పాటు నలుగురు ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరి కాని ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆప్షన్‌ ప్రకారం ఒక్కసారి జట్టును వీడిన ఆటగాడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం (ఆ మ్యాచ్‌ వరకు) ఉండదు. 

ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌లో మాత్రమే అమల్లో ఉన్న ఈ రూల్‌ త్వరలో  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లోకి రానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో సైతం ప్రవేశ పెట్టాలని బీసీసీఐ యోచిస్తుంది. క్రికెట్‌తో పాటు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆప్షన్‌ ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా అమల్లో ఉంది. ఈ రూల్‌ అమల్లోకి వస్తే క్రికెట్‌ మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు