ఐపీఎల్‌... ప్రేక్షకుల్లేకుండానే!

8 Mar, 2021 05:37 IST|Sakshi

ఏప్రిల్‌ 9 నుంచి     మే 30 వరకు

ఆరు నగరాల్లో టోర్నీ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికలపైనే

తొలి పోరులో ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ‘ఢీ’

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏమాత్రం ఆలస్యం కాకుండా అలరించేందుకు త్వరలోనే మన ముందుకొస్తోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం గత సీజన్‌లాగే ఎంట్రీ లేదు. అయితే అది యూఏఈలో జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ స్వదేశంలో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వెళ్లి చూడలేకపోవడం మాత్రం భారత క్రికెట్‌ ప్రేమికులకు కాస్త నిరాశ కలిగించే అంశం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్‌ పాలక మండలి మే 6 దాకా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  తదుపరి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతించే విషయం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు.

► మొత్తం ఆరు వేదికల్లో (చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా) ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్‌–2021 మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ 8 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టుకు సొంత వేదికలో మ్యాచ్‌లు ఉండవు. అన్ని జట్లూ తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.  

► ఏప్రిల్‌ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌తో విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడుతుంది.  

► బెంగాల్‌లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆరంభ దశ మ్యాచ్‌లను కోల్‌కతాకు కేటాయించలేదు. ఎన్నికల కౌంటింగ్‌ మే 2న ముగిశాక కోల్‌కతాలో మే 9 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారు.  

► ప్రతీ జట్టు నాలుగు వేదికల్లో తలపడుతుంది. మొత్తం 56 లీగ్‌ దశ మ్యాచ్‌ల్లో చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో పదేసి మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలపై ఎనిమిది చొప్పున లీగ్‌ పోటీలు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లో మే 25న క్వాలిఫయర్‌–1, మే 26న ఎలిమినేటర్, మే 28న క్వాలిఫయర్‌–2, మే 30న ఫైనల్‌ జరుగుతాయి.  

► ఈ సీజన్‌లో 11 రోజులు రెండు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైతే, రెండో మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు