ఫిక్సర్లకు యూఏఈ అడ్డాలాంటిది

27 Jul, 2020 02:48 IST|Sakshi

మూడు వేదికల్లోనే జరగనుండటంతో పర్యవేక్షణ కష్టం కాదు

ఐపీఎల్‌పై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ అజిత్‌ సింగ్‌ విశ్వాసం

ముంబై: ఐపీఎల్‌–2020 యూఏఈలో జరిగే సమయంలో ఫిక్సింగ్, బెట్టింగ్‌ తదితర అంశాలపై ఒక కన్నేసి ఉంచడంలో ఎలాంటి కష్టం ఉండబోదని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధినేత అజిత్‌ సింగ్‌ అన్నారు. దేశంలోని ఎనిమిది వేదికలతో పోలిస్తే మూడు చోట్లనే మ్యాచ్‌లు జరగనుండటం తమ పని సులువు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లీగ్‌ను బయో సెక్యూర్‌ వాతావరణంలో నిర్వహిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ ఏర్పాట్లు చేసుకుంటామని అజిత్‌ సింగ్‌ వెల్లడించారు.

‘క్రికెట్‌లో అవినీతిని అరికట్టే విషయంలో మా బృందం సమర్థంగా పని చేస్తుంది. అది మన దేశంలో అయినా మరెక్కడైనా పనితీరు ఒకే తరహాలో ఉంటుంది. బుకీల వ్యవహారంపై మాకు స్పష్టత ఉంది. నిజానికి ఫిక్సర్లకు యూఏఈ అడ్డాలాంటిది. అయితే అక్కడి మూడు వేదికల్లో ఫిక్సింగ్‌పై దృష్టి పెట్టేందుకు మేం తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం. ఒక వేళ తగినంత మంది అధికారులు లేరని భావిస్తే అక్కడే ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి వారి అనుమతితో అక్కడి మనుషులనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటాం. అంతే కానీ ఉదాసీతనకు చోటివ్వం’ అని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు