సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా చేతన్‌ శర్మ

25 Dec, 2020 03:55 IST|Sakshi

మహంతి, కురువిల్లాలకు చోటు

అహ్మదాబాద్‌: భారత క్రికెట్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ పేస్‌ బౌలర్‌ చేతన్‌ శర్మ (నార్త్‌ జోన్‌) ఎంపికయ్యాడు. గురువారం జరిగిన బీసీసీఐ ఎజీఎంలో ఈ ఎంపికను ఖరారు చేశారు. చేతన్‌తో పాటు సెలక్షన్‌ కమిటీలో మాజీ పేసర్లు అబయ్‌ కురువిల్లా, దేవాశీష్‌ మొహంతి లకు కూడా అవకాశం దక్కింది. మదన్‌ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లు సభ్యులుగా ఉన్న క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త సెలక్టర్లను ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్‌ కమిటీలో ఇప్పటికే సునీల్‌ జోషి, హర్వీందర్‌ సింగ్‌ ఉన్నారు.

కొత్తగా ఎంపికైన ముగ్గురు వీరితో జత కలుస్తారు. ఇప్పటి వరకు జోషి చైర్మన్‌గా వ్యవహరించినా... నిబంధనల ప్రకారం ఐదుగురిలో ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్‌ శర్మ ఇకపై చీఫ్‌ సెలక్టర్‌ హోదాలో పని చేస్తాడు. వెస్ట్‌ జోన్‌నుంచి చివరి నిమిషం వరకు అజిత్‌ అగార్కర్‌ పేరు వినిపించినా... అనూహ్యంగా కురువిల్లాకు అవకాశం లభించింది. వీరితో పాటు సెలక్టర్‌ పదవి కోసం మణీందర్‌ సింగ్, నయన్‌ మోంగియా, శివసుందర్‌ దాస్, రణదేబ్‌ బోస్‌ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం సెలక్షన్‌ కమిటీలో ఐదుగురూ బౌలర్లే (నలుగురు పేస్, ఒకరు స్పిన్నర్‌) కావడం విశేషం!

తొలి హ్యాట్రిక్‌తో...
పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో చేతన్‌ శర్మ భారత్‌ తరఫున 23 టెస్టులు (61 వికెట్లు), 65 వన్డేలు (67 వికెట్లు) ఆడాడు. 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ‘హ్యాట్రిక్‌’ తీసిన చేతన్‌...ఈ రికార్డు  సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఏడాది ఆస్ట్రలేసియా కప్‌ ఫైనల్లో అతని బౌలింగ్‌లో చివరి బంతికి మియాందాద్‌ సిక్సర్‌ బాది పాక్‌ను గెలిపించిన క్షణం చేతన్‌ను సుదీర్ఘ కాలం వెంటాడటంతో అతని ఘనతలకు తగిన గుర్తింపు దక్కలేదు. దేవాశీష్‌ మొహంతి భారత్‌ తరఫున 2 టెస్టులు (4 వికెట్లు), 45 వన్డేలు (57 వికెట్లు) ఆడగా... అబయ్‌ కురువిల్లా 10 టెస్టులు (25 వికెట్లు), 25 వన్డేల్లో (25 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.  

మరిన్ని వార్తలు