బీసీసీఐకి కొత్త ఏసీయూ చీఫ్‌

5 Apr, 2021 15:25 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)లో కీలక విభాగమైన యాంటీ కరప్షన్ యూనిట్‌కు  కొత్త బాస్‌ను నియమించారు. త్వరలో ఐపీఎల్‌-14వ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్ షెఖదమ్‌ ఖాండావాలాను కొత్త ఏసీయూ చీఫ్‌గా నియమించింది.  బీసీసీఐలో ఇప్పటివరకూ ఏసీయూ చీఫ్‌గా వ్యవహరించిన అజిత్ సింగ్ షెకావత్ పదవీకాలం మార్చి 31న ముగిసింది. 2018 ఏప్రిల్ 30‌ నుంచి 2021 మార్చి 31 వరకూ అజిత్‌ సింగ్‌ షెకావత్‌ బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా సేవలందించారు. 

ఐపీఎల్‌లో బెట్టింగ్ మాఫియా పెరిగిపోతుండటంతో బుకీలపై నిఘా తప్పనిసరి చేశారు. అందుకే పాత చీఫ్ పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నియామకం చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండటంతో షాబిర్ హుస్సేన్ రెండు రోజుల్లో అక్కడకు ప్రయాణం కానున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆటగాళ్లందరికీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

'ఏసీయూ రెండు బృందాలుగా విడిపోయి చెన్నై, ముంబై ప్రయాణం అవుతాయి. రెండు నగరాల్లో ఉన్న ఎనిమిది జట్లలోని ఆటగాళ్లకు ఒకసారి పూర్తి అవగాహన కల్పిస్తాము. బుకీలు ఆటగాళ్లను ఎలా సంప్రదిస్తారు. సోషల్ మీడియా ద్వారా ఆటగాళ్లకు ఎలా వలవేస్తారనే దానిపై పూర్తిగా పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తాము. గతంలో ఆటగాళ్లను ఎలా సంప్రదించి లోబరుచుకున్నారు అనే ఉదాహరణలు కూడా చెప్తాము' అని కొత్త బాస్ షాబిర్ హుస్సేన్ తెలిపారు. పాత ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ కాలంలో అనేక మంది బుకీలను అరెస్టు చేసి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఆటగాళ్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వారికి హెచ్చరికలు జారీ చేసి  అప్రమత్తం చేస్తారు.

ఇక్కడ చదవండి: కాస్కోండి.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి వస్తున్నాడు!

వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్‌ తప్పేమీ లేదు’

మరిన్ని వార్తలు