ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

16 Aug, 2022 15:03 IST|Sakshi

కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌ కోసం జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లకు ఒక విషయమై బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో నీటి సంక్షోభం తారాస్థాయిలో ఉంది. గుక్కెడు మంచినీళ్ల కోసం అక్కడి ప్రజలు ట్యాంకర్లు, ప్రభుత్వ నల్లాల ఎదుట బారులు తీరుతున్నారు. కొందరు షాపుల్లో దొరికే వాటర్‌ బాటిళ్లను కొనుక్కొని తాగడానికి.. వంటకు వాడుతున్నారు.

ముఖ్యంగా వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న ఆ దేశ రాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా కరువు ఛాయలతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వేలో ప్రతి ఏడాదీ ఈ సీజన్లో నీటి కొరత సర్వసాధారణం. 2019లో అయితే అక్కడి ప్రజలకు తాగునీరు లేక కలుషితమైన నీటినే తాగాల్సి వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈసారి కూడా నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో  బీసీసీఐ జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు కీలక సూచన చేసింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడారు. ‘జింబాబ్వేలో నీటి కొరత ఉంది. వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న హరారేలో  ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. దీంతో మేం క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడానలి సూచించాం. తక్కువ సమయంలో స్నానాలు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని క్రికెటర్లకు చెప్పాం. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్  పూల్స్ లో జలకాలాటలు వంటివి అన్ని రద్దు చేశాం.’అని  తెలిపాడు.

టీమిండియాకు విదేశీ పర్యటనలలో ఇలా నీటి కొరత ఎదురువడం ఇది తొలిసారి కాదు. గతంలో 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలను తీర్చారు. అయితే ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. తాము  ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని ఒక భారత క్రికెటర్‌ పేర్కొన్నాడు. 

చదవండి: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్‌- పాక్‌ మ్యాచ్‌ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర

 ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజం.. సెలక్టర్ల వల్లే!

మరిన్ని వార్తలు