Wriddhiman Saha: సాహాను బెదిరించిన జర్నలిస్టుకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఇకపై..

4 May, 2022 17:29 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను బెదిరించిన జర్నలిస్టు బోరియా మజుందార్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ షాకిచ్చింది. రెండేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు తాత్కాలిక సీఈఓ హేమంగ్‌ అమిన్‌ పేరిట బీసీసీఐ లేఖను పంపింది.

కాగా.. ‘‘భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తర్వాత.. సోకాల్డ్‌ ఓ జర్నలిస్టు నా పట్ల ప్రదర్శించిన ‘గౌరవం’ఇది! జర్నలిజం ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ జర్నలిస్టు బోరియా మజుందార్‌ తనకు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు సాహా షేర్‌ చేసిన విషయం తెలిసిందే. క్రికెట్‌ వర్గాల్లో ప్రకంపనలు రేపిన ఈ వ్యవహారాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. 

ఈ క్రమంలో సాహా ఆరోపణలకై దర్యాప్తునకై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. సాహా, మజుందార్‌ల వాదన విన్న అనంతరం... ‘‘మిస్టర్‌ మజుందార్‌ బెదరింపు ధోరణిని అవలంబించారు’’ అని పేర్కొంటూ ఆయనపై రెండేళ్ల నిషేధం విధించాల్సిందిగా బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు సిఫారసు చేసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన అపెక్స్‌ కౌన్సిల్‌ బోరియా మజుందార్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

దీని ప్రకారం..
►భారత్‌లో నిర్వహించే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రెస్‌ మెంబర్‌గా ఆయనకు అవకాశం ఉండదు.
►భారత్‌లో రిజిస్టర్‌ అయిన ఆటగాళ్లను ఆయన ఇంటర్వ్యూ చేయకూడదు.
►బీసీసీఐ, సభ్యులతో ఆయనను సంప్రదింపులు చేయరాదు. 
ఈ నిబంధనలు పాటించాల్సిందిగా అన్ని రాష్ట్రాల యూనిట్లకు బీసీసీఐ విజ్ఞప్తి చేసింది.

చదవండి👉🏾Sri Lanka Tour of Bangladesh: బంగ్లాదేశ్‌తో శ్రీలంక టెస్టు సిరీస్‌.. జట్టు ప్రకటన

మరిన్ని వార్తలు