బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్‌ కన్ఫర్మ్‌, వన్డే, టెస్ట్‌లకు..?

19 Nov, 2022 09:39 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిందన్న కారణంతో ఏకంగా జాతీయ సెలెక్షన్‌ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో SPLIT CAPTAINCY (వేర్వేరు కెప్టెన్లు) అమలు చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐలోని కీలక అధికారి జాతీయ మీడియాకు వెల్లడించినట్లు సమాచారం.

ఇటీవలికాలంలో టీ20 ఫార్మాట్‌లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేక, వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మను టెస్ట్‌, వన్డేలకు మాత్రమే పరిమితం చేసి, హార్ధిక్‌ పాం‍డ్యాను టీ20 సారధిగా నియమించేందుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. కొత్త సెలెక్షన్‌ కమిటీ చార్జ్‌ తీసుకోగానే ఈ విషయంపై డిస్కస్‌ చేసి అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం​ ఉంది.

వయసు పైబడిన రిత్యా రోహిత్‌పై భారం తగ్గించేందుకు టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో కూడా ఏదో దానిపై కోత పెట్టే అంశాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉంటే టీమిండియా సత్ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న బీసీసీఐ, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఒకవేళ వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లలో రోహిత్‌ను ఏదో ఒక దానిని నుంచి తప్పించాలని (కెప్టెన్సీ) బీసీసీఐ భావిస్తే మున్ముందు హిట్‌మ్యాన్‌ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రోహిత్‌ టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఉంటే, పుజారా, అశ్విన్‌లలో ఎవరో ఒకరికి టెస్ట్‌ కెప్టెన్సీ అప్పజెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, రోహిత్‌ పూర్తిస్థాయి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే, ఈ ప్రయోగాలేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ మినహాయించి రోహిత్‌ పెర్ఫార్మెన్స్‌ బాగానే ఉంది కదా అంటూ హిట్‌మ్యాన్‌ను వెనకేసుకొస్తున్నారు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ను మరికొంత కాలం కొనసాగించాలని బీసీసీఐని కోరుతున్నారు.

ఇప్పటికిప్పుడే టీ20 కెప్టెన్సీ మార్పు అవసరం లేదని సూచిస్తున్నారు. ఇంకొందరైతే.. టీ20 ప్రపంచకప్‌-2024ను దృష్టిలో పెట్టుకుని హార్ధిక్‌ను ఇప్పటినుంచే టీ20 కెప్టెన్‌గా ప్రమోట్‌ చేయడం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. కాగా, హార్ధిక్‌ నేతృత్వంలోనే ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్‌తో టీ20 ఆడుతున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిన్న (నవంబర్‌ 18) జరగాల్సిన తొలి మ్యాచ్‌ పూర్తిగా రద్దైంది.
చదవండి: బీసీసీఐ షాకింగ్‌ ప్రకటన.. సెలక్షన్‌ కమిటీ రద్దు

మరిన్ని వార్తలు