ఆస్పత్రిలో చేరిన సౌరవ్‌ గంగూలీ

2 Jan, 2021 14:11 IST|Sakshi

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం తన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన విలవిల్లాడిపోయారు. దీంతో సౌరవ్‌ను హుటాహుటిన ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సౌరవ్‌కు గుండెపోటుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం డాక్టర్‌ సరోజ్‌ మోండల్‌ పర్యవేక్షణలో ఆయన‌ చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం సౌరవ్‌కు యాంజియో ప్లాస్టీ చేయనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

స్పోర్ట్స్‌ జర్నలిస్టు బొరియా మజుందార్‌ గంగూలీ అస్వస్థతకు సంబంధించి ట్విటర్‌లో వివరాలు వెల్లడించారు. ఉదయం నుంచే ఆయన నలతగా ఉన్నారని తెలిపారు. యాంజియో ప్లాస్టీ అనంతరం సౌరవ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్‌ అయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సౌరవ్‌ త్వరగా కోలుకోవాలని రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: పొలిటికల్‌ ఎంట్రీ: దాదా భేటీపై రాజకీయ దుమారం)

>
మరిన్ని వార్తలు