ఐపీఎల్‌ నిర్వహణ ఇప్పట్లో కష్టమే: గంగూలీ

10 May, 2021 08:22 IST|Sakshi

శ్రీలంకలో భారత్‌ పర్యటన!

మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు 

ఆడనున్న టీమిండియా

జూలైలో సిరీస్‌ ఉండే అవకాశం

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడి

కోల్‌కతా: ఈ ఏడాది జూలైలో భారత జట్టు శ్రీలంక లో పర్యటించి మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. అదే విధంగా.. ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను పూర్తి చేయడంపై ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత బృందం జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయలుదేరనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌లో భారత స్టార్‌ ఆటగాళ్లెవరూ పాల్గొనే అవకాశం లేదు. ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక కాలేకపోయిన భారత ఇతర ఆటగాళ్లను శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేస్తారు. ధావన్, హార్దిక్, భువనేశ్వర్, దీపక్‌ చహర్, చహల్, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ తదితరులు శ్రీలంక పర్యటనకు వెళ్లవచ్చు.

మరోవైపు ‘బయో బబుల్‌’లో కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో ఈ ఏడాది ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో మిగిలిన 31 ఐపీఎల్‌ మ్యాచ్‌లు భారత్‌ లో జరిగే అవకాశం లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను వీక్షించేందుకు గంగూలీతోపాటు బీసీసీఐ కార్యదర్శి జై షా ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చించే అవకాశముంది. 
చదవండి: 'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శ‌వాల‌ను చూడండి'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు