టెస్టు జట్టులో సిరాజ్‌

27 Oct, 2020 04:19 IST|Sakshi

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్ల ప్రకటన

గాయంతో రోహిత్‌ శర్మ దూరం

టి20 జట్టులో వరుణ్‌ చక్రవర్తికి చోటు

32 మందితో ఆసీస్‌కు కోహ్లి బృందం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్‌ 27న టి20 సిరీస్‌తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్‌ మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది.

చీఫ్‌ సెలెక్టర్‌ సునీల్‌ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్‌ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్‌ నాగర్‌కోటి, కార్తీక్‌ త్యాగి, ఇషాన్‌ పోరెల్, నటరాజన్‌ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు.

బయో బబుల్‌ వాతావరణంలో జరిగే ఈ సిరీస్‌ కోసం మూడు జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాకు వెళతాయి. గాయాలతో బాధపడుతున్న స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, బౌలర్లు ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌లను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. తొడ కండరాలతో బాధపడుతున్న రోహిత్‌ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

సిరాజ్‌ శ్రమకు ఫలితం...
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ జట్టు పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్‌ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు.   

వన్డే, టి20 జట్ల నుంచి పంత్‌ అవుట్‌...
ఏడాది తర్వాత కేఎల్‌ రాహుల్‌ టెస్టు జట్టులో పునరాగమనం చేయగా... నిలకడగా ఆడలేకపోతున్న వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను వన్డే, టి20 జట్ల నుంచి తప్పించి కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు. తమిళనాడు ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి తొలిసారి టి20 జట్టులో స్థానం పొందాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల వరుణ్‌ 13 వికెట్లు తీశాడు. ఏడు రకాల బంతులను వేయగల వైవిధ్యం వరుణ్‌ సొంతం. ఈ ఐపీఎల్‌లో వరుణ్‌ స్పిన్‌కు వార్నర్, ధోని, పంత్, శ్రేయస్‌ అయ్యర్‌ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు బోల్తా పడ్డారు.   

భారత జట్ల వివరాలు
టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రహానే (వైస్‌ కెప్టెన్‌), మయాంక్, పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్, పుజారా, విహారి, శుబ్‌మన్‌ గిల్, సాహా (వికెట్‌ కీపర్‌), పంత్‌ (వికెట్‌ కీపర్‌), బుమ్రా, షమీ, ఉమేశ్, సెనీ, కుల్దీప్, జడేజా, అశ్విన్, సిరాజ్‌.  

వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్, వికెట్‌ కీపర్‌), ధావన్, శుబ్‌మన్‌ గిల్, అయ్యర్, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, మయాంక్, జడేజా, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌.

టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్, వికెట్‌ కీపర్‌), ధావన్, మయాంక్, అయ్యర్, పాండే, హార్దిక్‌ పాండ్యా, సామ్సన్‌ (వికెట్‌ కీపర్‌), జడేజా, వాషింగ్టన్‌ సుందర్, చహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్‌ చహర్, వరుణ్‌ చక్రవర్తి. అదనపు పేస్‌ బౌలర్లు: కమలేశ్‌ నాగర్‌కోటి, కార్తీక్‌ త్యాగి, ఇషాన్‌ పోరెల్, నటరాజన్‌.  

మరిన్ని వార్తలు