భారత్, ఇంగ్లండ్‌ టి20 సిరీస్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులు!

25 Jan, 2021 04:25 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వంతో బీసీసీఐ సంప్రదింపులు

న్యూఢిల్లీ: కరోనా ఐపీఎల్‌–13ను భారత్‌కు దూరం చేసినా... మన కంటికి టీవీల ద్వారా దగ్గర చేసింది. కానీ అక్కడ (యూఏఈలో) ప్రత్యక్షంగా చూసే భాగ్యమైతే ఎవరికీ దగ్గలేదు. ఇప్పుడు భారత్‌లో ఈ వెలతిని తొలగించేందుకు... క్రికెట్‌ స్టేడియం గేట్లు తెరిపించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మార్చిలో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టి20 సిరీస్‌కు ప్రేక్షకుల్ని అనుమతించే పనిలో పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని బోర్డు నిర్ణయించింది.

‘ప్రేక్షకులను స్టేడియంలోకి తీసుకురావాలని యోచిస్తున్నాం. మెరుపుల టి20 సిరీస్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పించాలనుకుంటున్నాం. అయితే ఎంత మందిని అనుమతించాలనే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 50 శాతం సీట్లను ప్రేక్షకులతో నింపాలనే ఆలోచన ఉంది. ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది. ఇక్కడ అందరి ఆరోగ్యం, భద్రతే ప్రధానమైంది. సురక్షితంగా నిర్వహించడమే ముఖ్యం’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కోవిడ్‌–19 నేపథ్యంలో ఆటగాళ్లకు హాని చేసే ఏ రిస్క్‌ తీసుకోకూడదని బోర్డు భావిస్తోందని, క్రికెటర్లు క్వారంటైన్, కరోనా పరీక్షలు నిర్వహించాకే బయో బబుల్‌లోకి వెళ్తారని అక్కడ్నించి ఆంక్షలు మొదలవుతాయని చెప్పారు.

ఇప్పటికైతే టెస్టు సిరీస్‌ను గేట్లు మూసే (ప్రేక్షకుల్లేకుండా) నిర్వహించనున్నారు. టికెట్లు జారీ చేయరాదని తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) తమ అధికార వర్గాలకు సమాచారమిచ్చింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు (ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు; ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు) చెన్నైలోనే జరుగుతాయి. అనంతరం మూడో టెస్టు ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు... నాలుగో టెస్టు మార్చి 4 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లోనే మార్చి 12 నుంచి ఐదు మ్యాచ్‌ ల టి20 సిరీస్‌ మొదలవుతుంది. అక్కడి సర్దార్‌ పటేల్‌ మొతెరా స్టేడియాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. దీంతో లక్షా 10 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను తిలకించవచ్చు. కనీసం 50 శాతం అనుమతించినా 55 వేల మందికి ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలుగుతుంది.

మరిన్ని వార్తలు