BCCI President: బీసీసీఐ కొత్త బాస్‌ ఎవరంటే..?

11 Oct, 2022 15:59 IST|Sakshi

సౌరవ్‌ గంగూలీ తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ ఆల్‌రౌండర్‌ రోజ‌ర్ బిన్నీ ఎన్నిక దాదాపుగా ఖరారైంది. బిన్నీకి ఈ పదవి కట్టబెట్టేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులందరూ ఏకపక్షంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం బిన్నీ ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబైలో ఇవాళ జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశంలో అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష, కార్యదర్శి, ఐపీఎల్‌ చైర్మన్‌ అభ్యర్ధిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. 

ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా, కార్యదర్శిగా జై షా కొన‌సాగ‌నుండగా.. ఐపీఎల్‌ చైర్మన్‌గా బ్రిజేష్‌ పటేల్‌ స్థానంలో అరుణ్‌ ధుమాల్‌ ఆ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ భవితవ్యంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గంగూలీని ఐసీసీ అధ్యక్ష బరిలో నిలిపేందుకు బోర్డు సభ్యులందరూ అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్య‌క్ష ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 18వ తేదీన జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే.

బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రోజర్‌ బిన్నీ విషయానికొస్తే.. 67 ఏళ్ల ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ భారత్‌ 1983 వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అతను ప్రస్తుతం క‌ర్నాట‌క క్రికెట్ సంఘం ఆఫీస్‌ బేర‌ర్‌గా  కొన‌సాగుతున్నాడు. గ‌తంలో బిన్నీ జాతీయ సెల‌క్ష‌న్ కమిటీ స‌భ్యుడిగా ఉన్నాడు. బిన్నీ.. 1980-87 మధ్య 27 టెస్ట్ లు, 72 వన్డేలు ఆడి 1459 పరుగులు సాధించి, 113 వికెట్లు పడగొట్టాడు. 1983 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన బిన్నీ.. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

మరిన్ని వార్తలు